NVSS Prabhakar : సీఎం వద్దే ఆ శాఖ ఉన్నా … ఇలాంటి ఘటనలు జరగడమేంటి? : ప్రభాకర్

ప్రతివారం ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి విద్యార్థులు(Students) అస్వస్థతకు గురవుతున్నారని, విద్యాశాఖ సీఎం వద్దే ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడమేంటని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై వస్తున్న వార్తలు కొన్నే ఉన్నాయని, బయటకు రాని సంఘటనలు చాలా ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం బెల్ట్ షాపులు (Belt shops) లేకుండా చేస్తామని చెప్పింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చెప్పింది కానీ, ఎక్కడా మూసివేసిన దాఖలాలు లేవు. మద్యం అమ్మకాల ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలనే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ ప్రభుత్వం దాన్నే కొనసాగిస్తోంది. గతం కంటే మూడు రెట్లు పెంచింది. మద్యం మత్తులో ప్రజలు ఉంచి 6 గ్యారంటీలను మర్చిపోయేలా చేయాలని చూస్తోంది. ఏ శాఖలో చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. కురుస్తున్న వర్షాలకు జీహెచ్‌ఎంసీ (GHMC ) పరిధిలో మోకాలు లోతు నీళ్లు నిలుస్తున్నాయి. పరిస్థితి మారట్లేదు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకుడే లేరు. పరిపాలన చేతకాకుంటే దిగిపోండి అని అన్నారు.