BioAsia Conference: గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ : రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బయో ఏషియా 2025 సదస్సు ఘనంగా జరిగింది. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, శాస్త్ర పురోగతిపై ఇందులో చర్చించారు. సుమారు 50 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి తరలివచ్చారు. సదస్సుకు ‘క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్.. ఎక్స్‌పాండిరగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ వంటి అంశాలను ఎజెండా అంశాలుగా నిర్ణయించి చర్చించారు.
ఈ సదస్సు ప్రారంభదినం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడుల సాధన ద్వారా రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కొత్త ఉగ్యోగాలను సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డుతో పాటు కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగు రోడ్డు నడుమ ఫార్మా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని వెల్లడిరచారు. తద్వారా విభిన్న రంగాల్లో సుమారు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గత ఏడాది 150కి పైగా ప్రాజెక్టుల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు.
‘ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫార్మాసిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇప్పటికే దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జర్మన్ కంపెనీ మిల్టెనీ బయోటెక్ జీనోమ్ వ్యాలీలో సెల్, జీన్ థెరపీని ప్రారంభించిందని తెలియజేశారు. కొత్తగా 4 బహుళ జాతి లైఫ్ సైన్సెస్ కంపెనీలు కూడా తెలంగాణలో అడుగుపెడుతున్నాయి. గడిచిన 25 ఏళ్లలో ఫార్మా, తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో వపర్‌హౌస్‌గా హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో పేరొందిన అనేక ఫార్మా, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై కృషి చేసే సంస్థలను ప్రోత్సహిస్తూ శాస్త్ర, సాంకేతిక నిపుణులను తయారు చేయడంతో పాటు జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేసుకున్నామని, ఏటా జరిగే బయో ఆసియా సదస్సులు హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రాజధానిగా నిలబెట్టాయని చెప్పారు. ఆరోగ్య రక్షణ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటుం ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా ‘బయో ఆసియా’ దేశ విదేశాలను ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రాబోయే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో సేవల రంగాన్ని ప్రోత్సహిస్తూ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీలో అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. దేశంలోనే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకంతో హైదరాబాద్ ఈవీ రాజధానిగా అవతరించింది. ఆర్టీసీలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నామని, ఔటర్, ట్రిపుల్ ఆర్‌ను రేడియల్ రోడ్లతో అనుసంధానం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ‘చైనా ప్లస్ వన్’ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మెగా డ్రైపోర్టును అభివృద్ధి చేసి ఏపీలోని ‘సీ పోర్టు’తో రైలు, రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానిస్తామని చెప్పారు. తెలంగాణను బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా అభివృద్ధి చేస్తాం..’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
బయో ఏషియా సదస్సులో 80 స్టార్టప్‌లు.. 70 కంపెనీలు
కొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చిన స్టార్టప్‌లకు బయో ఏషియా సదస్సు వేదికగా నిలిచింది. 80 స్టార్టప్?లు ఈ సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. వాటితో పాటు 70కిపైగా సంస్థలు తమ వ్యాపార విస్తరణపై స్టాల్స్‌పెట్టాయి. ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ స్టేట్ కూడా పెట్టుబడులకు సంబంధించి స్టాల్ ను ఏర్పాటు చేయగా.. కర్నాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. ఎంఎస్‌ఎంఈ కింద ఏర్పాటైన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకున్నాయి. కాగా, ఈ సదస్సు వేదికగా తెలంగాణ రాష్ట్రంతో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ఎజిలీసియం.. హైదరాబాద్‌లోని ఆర్‌ఎంజెడ్‌స్పైర్‌లో కొత్త ఆఫీసు ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకుంది. అలాగే.. ఏఎల్‌ఎస్ అనే కంపెనీ ఔషధాల టెస్టింగ్, ఇన్‌స్పెక్షన్, సర్టిఫికేషన్, వెరిఫికేషన్ సొల్యూషన్స్‌కు సంబంధించి జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా సీజీఎంపీ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనుంది. మైషి ఫార్మా హైదరాబాద్‌లో రెండో ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. గ్రాన్యూల్స్, ఆర్బిక్యులర్, ఐజంట్, బయోలాజికల్ ఈ, విర్కో, విరూపాక్ష, జుబిలెంట్, విమ్టా, అరాజెన్, భారత్ బయోటెక్, సాయి లైఫ్‌సౖన్సెస్ వంటి సంస్థలు.. గ్రీన్ ఫార్మా సిటీలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.
రాష్ట్రంలో ఇన్నొవేటివ్ ఫార్మాస్యూటికల్‌సర్వీసెస్ ఆర్గనైజేషన్ (ఐపీఎస్‌వో) ను బయోఏషియా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలను తీర్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు 11 సంస్థలు సంయుక్తంగా ఈ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశాయి. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్?తో మాంచెస్టర్‌కు చెందిన హెల్త్‌ఇన్నొవేషన్ కీలక ఒప్పందం చేసుకున్నది. హెల్త్‌కేర్, మెడ్‌టెక్, డయాగ్నస్టిక్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నారు. కాగా, ఏషియన్ ఇన్ స్టిట్యూట్‌ఆఫ్‌గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ సోమ్‌నాథ్ సహా పలు సంస్థలకు చెందిన చైర్మన్లు, సీఈవోలు పానెల్‌డిస్కషన్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.