KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్… విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ-కార్ రేస్ (Formula E Car Rase) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మెడపై ఇన్నాళ్లూ వేలాడుతున్న కత్తి ఇప్పుడు మరింత బిగుసుకుంది. ఈ కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
కొంతకాలంగా ఈ ఫైల్ రాజ్‌భవన్ వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు లేఖ రాశారు. అయితే, నెలలు గడుస్తున్నా గవర్నర్ నుంచి స్పందన రాకపోవడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో దీనిని ప్రస్తావించారు. “బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అందుకే కేటీఆర్ విచారణ ఫైలును గవర్నర్ తొక్కిపెట్టారు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే గవర్నర్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఏసీబీకి కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు మార్గం సుగమమైంది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా-ఈ రేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. రేసు నిర్వహణ సంస్థ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO)కు, ఒప్పందం ఖరారు కాకముందే రూ. 55 కోట్లు చెల్లించారు. ఎటువంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులు విడుదల చేశారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం, నిర్వాహక సంస్థ, ప్రమోటర్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగాలి. కానీ, ఇది పూర్తికాకుండానే డబ్బులు బదిలీ అయ్యాయి. అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ నిధుల విడుదలలో కీలక పాత్ర పోషించారు. అయితే, విచారణలో ఆయన “అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను సంతకాలు చేశానని, నిధులు విడుదల చేశానని” వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు కేటీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది.
ఈ కేసులో కేటీఆర్‌ను ఇరికించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం నోట్ ఫైల్స్, అర్వింద్ కుమార్ వాంగ్మూలం. క్యాబినెట్ ఆమోదం లేకుండా లేదా ఆర్థిక శాఖ అనుమతులు పూర్తి స్థాయిలో లేకుండానే రూ. 55 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేయడంపై ఏసీబీ గురిపెట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ (PC Act)లోని సెక్షన్ 17A ప్రకారం, ఒక ప్రజా ప్రతినిధిని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు ఆ అనుమతి రావడంతో, కేటీఆర్ తన మంత్రి హోదాను ఉపయోగించి నిధులు దారి మళ్లించారా? అన్న కోణంలో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేయనుంది.
గవర్నర్ అనుమతితో బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిణామాలు తప్పకపోవచ్చు. అవినీతి ఆరోపణలపై కేటీఆర్‌ను విచారించడం ద్వారా, గత పదేళ్ల పాలనలో దోపిడీ జరిగిందన్న తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తీసుకున్న నిర్ణయాలను, అవినీతిగా చిత్రీకరిస్తున్నారని వారు వాదిస్తున్నారు. గవర్నర్ అనుమతితో బంతి ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఉంది. త్వరలోనే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఒకవేళ అరెస్టు వరకూ పరిస్థితి వెళితే, అది తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం అవుతుంది. రేసు జరగకపోయినా, రాజకీయ రేసులో మాత్రం ఈ కేసు ఇప్పుడు టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.






