Bhatti Vikramarka: 2018లో చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది : భట్టి

రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా పరిమితి విధిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో చేసిన చట్టం బీసీలకు ఉరితాడైందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. రిజర్వేషన్ల జీఓపై స్టే విధిస్తూ హైకోర్టు (High Court) తీర్పు వెల్లడిరచిన అనంతరం గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ (Assembly) లో చేసిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకుండా బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు న్యాయపరంగా, రాజకీయం గా కొట్లాడతామని ఉద్ఘాటించారు. గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పులను పరిశీలించాం. న్యాయనిపుణులు, మేధావులు, ప్రజాసంఘాల నేతల సూచనలు, సలహాలు తీసుకుని శాస్త్రీయంగా సమగ్ర కుల సర్వే చేశాం. దానికి అనుగుణంగా రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లును గవర్నర్‌కు పంపించాం. బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందంతో బీసీల నోటికాడికి వచ్చిన ముద్దను అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పాల్గొననివారు మా చిత్తశుద్ధిని శంకిస్తూ బీసీలపై కపటప్రేమ కనబరుస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను అడుగుతున్నా, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చట్టం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు.