Seethakka: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది ఆ ప్రభుత్వమే : మంత్రి సీతక్క
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను, 2019లో 22 శాతానికి తగ్గించి ఆ వర్గాల గొంతు కోసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. ప్రజాభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ అన్యాయాన్ని రాష్ట్రంలోని బీసీ (BC) ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) అసత్య ప్రచారాన్ని ఆ వర్గాలు నమ్మబోరని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమా? అని సవాల్ విసిరారు. 2019 స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ విధానాన్ని ఖరారు చేస్తే, సుప్రీంకోర్టు (Supreme Court) తప్పు పట్టిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సర్పంచ్ రిజర్వేషన్లను మండలం యూనిట్‌గా, వార్డు సభ్యుల రిజర్వేషన్‌ను గ్రామ పంచాయతీ యూనిట్‌గా పరిగణనలోకి తీసుకున్నామన్నారు. భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కేటాయించామన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.






