Bandi Sanjay: తెలంగాణ హక్కులు కాపాడే బాధ్యత మాది.. బనకచర్లపై బండి సంజయ్

బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సమాఖ్య స్ఫూర్తితో, సమ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూడటమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానమని పునరుద్ఘాటించారు. బనకచర్ల ప్రాజెక్టుపై జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ వాదనను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బలంగా వినిపించాలని బండి సంజయ్ కోరారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు (1980), ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014) ఉల్లంఘనకు ఈ ప్రాజెక్టు దారితీయవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. “ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాపై ఉంది. తెలంగాణ హక్కులను కాపాడే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది” అని హామీ ఇచ్చారు.