Band Sanjay: రాహుల్ తాత పేరు తెలుసా?.. మోదీ కులంపై రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Band Sanjay) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న బూటకపు హామీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ‘ఎక్స్’ వేదికగా సోషల్ మీడియాలో స్పందించిన బండి సంజయ్.. మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి చేసిన పరిశోధన పూర్తిగా తప్పుల తడక అని, 1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నరేంద్ర మోదీ ఓబీసీ జాబితాలో చేరారని బండి సంజయ్ (Band Sanjay) వెల్లడించారు. కానీ, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని చెప్పారు.
అక్కడితో ఆగని బండి సంజయ్.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేశారు. అసలు రాహుల్ గాంధీ కులం ఏమిటో చెప్పాలని సీఎం రేవంత్‌ను సంజయ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏ మతానికి చెందిన వారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని మీకు తెలుసా? హిందూ మతంలో తండ్రి కులమే వారసులకు వస్తుందని తెలీదా?’ అని (Band Sanjay) అడిగారు. చట్టబద్ధంగా కులమైనా, మతమైనా ఎవరు మారారనే అంశంపై చర్చలు జరపాలని అనుకుంటే.. ముందుగా 10 జన్‌పథ్ నుంచి ప్రారంభిద్దామని సంజయ్ చెప్పారు. 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీ కుటుంబం నివశిస్తున్న సంగతి తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అలా చెయ్యనివ్వబోమని బండి సంజయ్ (Band Sanjay) స్పష్టం చేశారు. అలాగే ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమన్న ఆయన.. మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నాలను తాము అడ్డుకొని తీరతామని తేల్చిచెప్పారు.