Telangana: తెలంగాణ చిన్నారుల కోసం ‘బాలభరోసా’..
ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లితండ్రులకు శుభవార్త. సంక్షేమపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం.. చిన్నారుల సంపూర్ణఆరోగ్యం కోసం ఓ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా …. రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ‘బాల భరోసా’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని చిన్నారుల ఆరోగ్య స్థితిగతులపై ఇటీవల అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 8 లక్షల మంది చిన్నారులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో కొందరు రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతుండగా, మరికొందరు వినికిడి, దృష్టి లోపాలు, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా గుర్తించిన చిన్నారులందరికీ అండగా నిలిచేందుకే ప్రభుత్వం ‘బాల భరోసా’ పథకాన్ని రూపొందించింది.
ఈ పథకం కింద వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. వినికిడి లోపం ఉన్నవారికి అవసరమైన పరికరాలను అందిస్తారు. దీంతో పాటు ఇతర వైద్య సేవలను కూడా పూర్తిగా ఉచితంగా కల్పిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని పర్యవేక్షించనున్నాయి.
‘బాల భరోసా’ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం దీనిని ఆరోగ్యశ్రీకి అనుసంధానించాలని నిర్ణయించింది. ఒకవేళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులుంటే, వాటి చికిత్స ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమాన్ని (ఆర్బీఎస్కే) కూడా ఈ పథకంలో విలీనం చేయనున్నారు.
ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు తెలంగాణ సర్కార్ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ప్రతి చిన్నారి వైద్య చరిత్ర, వారికి అందిస్తున్న చికిత్స, దాని పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ఈ బృహత్తర పథకం విజయవంతమైతే, రాష్ట్రంలోని లక్షలాది మంది చిన్నారులకు చిన్న వయసులోనే మెరుగైన వైద్యం అంది, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది పడుతుందని అధికారులు భావిస్తున్నారు.






