Obulapuram: ఓఎంసీ కేసులో … గాలి జనార్దనరెడ్డికి బెయిల్

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నలుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దనరెడ్డి (Gali Janardhana Reddy)తో పాటు, ఆయన పీఏ అలీఖాన్ (Ali Khan), బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌కు బెయిల్ ఇచ్చింది. ఈ నలుగురికి సీబీఐ కోర్టు (CBI court) విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10 లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. పదిహేనేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఒబుళాపురం (Obulapuram) అక్రమ మైనింగ్ కేసులో మే 6న నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, వి.డి.రాజగోపాల్ (V.D. Rajagopal), మెఫజ్ అలీఖాన్‌లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో వీరికి ఊరట లభించింది.