Azharuddin: అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖలివే..!!
                                    భారత మాజీ క్రికెట్ కెప్టెన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ అజారుద్దీన్‌కు (Mohammad Azharuddin) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శాఖలు కేటాయించారు. గత శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖతో (Minority Welfare) పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (Public Enterprises) శాఖలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అజారుద్దీన్ కు హోంశాఖ (Home Ministry) అప్పగించబోతున్నారనే ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది.
అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. మైనార్టీ వర్గం నుంచి చోటు దక్కించుకున్న అజారుద్దీన్‌కు కీలకమైన హోం మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ హోం మంత్రిగా పని చేయడంతో, అదే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించవచ్చని రాజకీయ విశ్లేషకులు, మీడియా వర్గాలు అంచనా వేశాయి. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. హోం శాఖ అప్పగింతపై జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయించారు. దీంతో అజారుద్దీన్‌కు హోం శాఖ దక్కుతుందన్న ఊహాగానాలు కేవలం ప్రచారమేనని తేలిపోయింది.
అజారుద్దీన్‌కు కేటాయించిన రెండు శాఖలు కూడా ఎంతో కీలకమైనవి. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల సంక్షేమం, విద్య, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పథకాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అజారుద్దీన్‌కు ఈ శాఖను అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వివిధ కార్పొరేషన్లు, సంస్థల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. ఆర్థికంగా, పరిపాలనాపరంగా ఈ శాఖ ఎంతో కీలకమైనది. గతంలో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉండేది. తన వద్ద ఉన్న కీలకమైన శాఖల్లో ఒకదానిని అజారుద్దీన్‌కు అప్పగించడం ముఖ్యమంత్రి ఆయనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా భావించవచ్చు.
మహ్మద్ అజారుద్దీన్ క్రికెట్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరపున ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఆ నియామక ప్రక్రియ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయినా రేవంత్ రెడ్డి, అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. గతంలో క్రికెట్ లో చెరగని ముద్ర వేసిన అజారుద్దీన్, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.







