MLAs: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్..! స్పీకర్ నోటీసులు..!!

తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు BRS ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. BRSను వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడడంతో ఆ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. అయితే ఏడాది కావస్తున్నా స్పీకర్ కార్యాలయం (speaker office) స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి నిర్దిష్టమైన ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ కార్యాలయ సెక్రటరీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా (CM Revanth Reddy) బాధ్యతలు చేపట్టిన తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలని అనర్హత (dismiss) వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే స్పీకర్ కార్యాలయం పట్టించుకోలేదనే ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్పీకర్ ను ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. కానీ స్పందన లేకుండా పోయింది.
దీంతో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో గత పిటిషన్ తో కలిపి దీన్ని కూడా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. గతంలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ పిటిషన్ విచారణలో ఉంది. దీనికి తాజాగా కేటీఆర్ వేసిన పిటిషన్ ను కూడా జత చేశారు. వీటన్నిటిపైన ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ ఉంది.
ఫిబ్రవరి 10న జరిగే విచారణకు స్పీకర్ కార్యాలయ తరపు న్యాయవాది కూడా హాజరు కావాల్సి ఉంది. ఈలోపు ఎలాంటి చర్యలు తీసుకున్నారని స్పీకర్ కార్యాలయ సెక్రటరీని సుప్రీంకోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. అందుకే స్పీకర్ కార్యాలయం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా లిఖిత పూర్వకంగా తమ సమాధానాలు ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాము వివరణ ఇచ్చేందుకు కాస్త సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. వాళ్లు ఎప్పటిలోపు వివరణ ఇస్తారో తెలియాల్సి ఉంది.