ASBL: కళా సంస్కృతుల సంగమం…

సుసంపన్నమైన కళలు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన భారతదేశ ఘన వారసత్వానికి ఆ కార్యక్రమం అద్దం పట్టింది. నగర జీవనం, ఒత్తిడి, ఉరుకుల పరుగులతో అలసిన మనసులను సేద తీర్చింది. లలిత కళల పట్ల మరుగున పడుతున్న ప్రేమను తట్టి లేపింది. హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠిలో ఉన్న భారతీయ విద్యా భవన్ లో జరిగిన ఎఎస్‌బిఎల్ (ASBL) సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. దీనిలో భాగంగా నృత్యప్రియ అకాడమీతో కలిసి పలు కళా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీ కృష్ణ లీలలే ఇతివృత్తంగా సాగిన కళా ప్రదర్శనతో పాటుగా, అంబపరకు, గణేశ పంచరత్నం, జయదేవ అష్టపది, నౌక చరితం వంటి ప్రదర్శనలు మన నాట్య రీతులలోని వైవిధ్యానికి, విశిష్టతకు ప్రతీకగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రికి, ఎఎస్‌బిఎల్ వ్యవస్థాపకులు, సిఇఒ అజితేష్ కొరుపోలు వంటి సాంస్కృతిక రంగ ప్రముఖులను సన్మానించారు. ఈ సందర్భంగా తమ సాంస్కృతిక భాగస్వామిగా నృత్యప్రియ అకాడమీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎఎస్‌బిఎల్ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం శాస్త్రీయ కూచిపూడి నృత్యం అభ్యసిస్తున్న 500 మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కళాభిమానులను ఒకచోట చేర్చింది.
సంస్కృతే సమాజానికి ఆత్మ…
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎఎస్‌బిఎల్ వ్యవస్థాపకులు, సిఇఓ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, ‘‘సంస్కృతి ఒక సమాజానికి ఆత్మ లాంటిది. ఆధునిక నివాసాలను నిర్మించేటప్పుడు, వాటిలో భావోద్వేగ సాంస్కృతిక సంబంధాలను నిర్మించడం కూడా అంతే ముఖ్యమైనదని మేం విశ్వసిస్తున్నాం. నృత్యప్రియతో మా భాగస్వామ్యం మా ఆలోచనల వ్యక్తీకరణ భారతీయ కళా వారసత్వపు గొప్పతనాన్ని చాటి చెప్పడం మా లక్ష్యం. కళ, సంప్రదాయం ఐక్యత సమకాలీన జీవితంలో భాగంగా ఉండేలా చూసుకోవడం అవసరం అని అన్నారు.