రేవంత్ రెడ్డి తొందర పడుతున్నారా..!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా హైడ్రా లాంటి వాటితో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి లాక్కొని ఆక్రమించుకుంటున్నారు. ఈ ఆక్రమణల విషయంలో రేవంత్ రెడ్డి తొందరపడుతున్నారేమోననే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నుంచి తాజాగా పీఏసీ ఛైర్మన్ నియామకం వరకూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆ సమయంలో ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేశారు కేసీఆర్. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన బాటలోనే పయనిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురిని ఆయన ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. మరికొంతమంది కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి చేరికలు ఆగాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే వారి విజ్ఞప్తులను స్పీకర్ పట్టించుకోలేదు. దీంతో వాళ్లు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా 40 రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున ఆ స్థానానికి గౌరవం ఇస్తున్నామని.. అయితే చట్టబద్ద, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పని చేస్తున్నప్పుడు కోర్టు జోక్యం చేసుకోకుండా ఎలా ఉండగలవని కోర్టు అభిప్రాయపడింది. ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఎలా చూడాలని హైకోర్టు ప్రశ్నించింది.
మరోవైపు.. హైకోర్టు తీర్పును ఇచ్చిన కొన్ని గంటల్లోనే పీఏసీ ఛైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించారు స్పీకర్. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరికెపూడి గాంధీ కొంతకాలం కిందట కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాంటి వ్యక్తికి పీఏసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. పైగా ప్రతిపక్ష పార్టీ సూచించిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి ఆ పదవి ఇవ్వడమేంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇలాంటి నిర్ణయాలన్నీ రేవంత్ రెడ్డి తొందరపాటును సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల స్పీకర్ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది.