KTR: కేటిఆర్ వాల్యూం తగ్గితే మంచిదా..?

2023లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(BRS) ఎందుకు ఓడిపోయింది.. అంటే, చాలామంది మాట్లాడే మాట ఆ పార్టీ నాయకుల దురుసు వైఖరి. ముఖ్యంగా కేటీఆర్ విషయంలో ఇది ఎక్కువగా వినపడిన విమర్శ. కేటీఆర్ స్వతహాగా దూకుడుగా ఉండే నాయకుడు. అయితే మాట్లాడే సమయంలో కూడా అదే దూకుడు ప్రదర్శించడం ముఖ్యంగా ప్రతిపక్షాల విషయంలో ఆయన మాట్లాడే మాటలు.. అప్పట్లో కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.
ఇక అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అదే తరహాలో వ్యాఖ్యలు చేయడం వంటివి చూస్తున్నాం. పదేపదే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కేటీఆర్ కు మైనస్ అవుతుంది అనే అభిప్రాయాలు కూడా కొంతవరకు వినిపించాయి. ఇక తాజాగా కెసిఆర్, కాలేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీలో కూడా కాస్త అసహనం వ్యక్తం అవుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఆయన మాట్లాడిన మాటలు.. అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో చేసిన వ్యాఖ్యలపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అరెస్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం గట్టిగా పడింది. హైదరాబాద్ తో పాటుగా వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో.. అలాగే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ప్రాంతాల్లో కేటీఆర్ వ్యాఖ్యల ప్రభావం గట్టిగానే పడిందని చెప్పాలి.
అలాంటిది మళ్లీ చంద్రబాబు విషయంలో ఆయన దూకుడుగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలి అంటే తెలుగుదేశం పార్టీని కూడా దగ్గర చేసుకోవాలి అనేది చాలామందిలో వినపడుతున్న మాట. 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి తెలుగుదేశం పార్టీ ప్రధాన బలంగా మారిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విఫలమైన సమయంలో టిడిపి సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో ఎక్కువగా భారత రాష్ట్ర సమితి నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేటీఆర్ కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.