Kavitha: కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాకు ముగింపు పలికినట్లేనా..?

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తుంది. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR), ఆయన కుమారుడు కేటీఆర్ (KTR), కుమార్తె కల్వకుంట్ల కవిత (Kavitha) చుట్టూ ఇటీవలి పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కవిత రాజకీయ ఆటుపోట్లు, కేసీఆర్‌తో సంబంధాలు, కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) విచారణ నేపథ్యంలో జరిగిన సంఘటనలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి.
గత కొంతకాలంగా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో ఆమె అరెస్టు, జైలు జీవితం తర్వాత కవిత రాజకీయంగా కొంత వెనుకబడినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు కేటీఆర్‌తో విభేదాలు తలెత్తాయని, పార్టీలో ఆమె పాత్రను తగ్గించే ప్రయత్నాలు జరిగాయని ప్రచారం జరిగింది. వరంగల్ సభ తర్వాత తాను కేసీఆర్ కు రాసిన ఓ లేఖ లీక్ కావడం వెనుక కేటీఆర్ ఉన్నారని కవిత ఆరోపించారు. లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలంటూ ఆమె బహిరంగంగానే డిమాండ్ చేశారు. అప్పటి నుంచి కవిత తన సొంత రాజకీయ గుర్తింపుకోసం తెలంగాణ జాగృతి ద్వారా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత ఆయన ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తండ్రీ-కూతుళ్ల మధ్య సమావేశం జరిగినట్లు వార్తలు వచ్చాయి, దీంతో కుటుంబంలో విభేదాలు సద్దుమణిగాయని కొందరు భావించారు. అయితే కవితను కేసీఆర్ పట్టించుకోలేదని, ఆమె ఆ తర్వాత బీఆర్కే భవన్‌కు రాకపోవడానికి ఇదే కారణమని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలు కల్వకుంట్ల కుటుంబంలో ఆధిపత్య పోరును మరింత ఉధృతం చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ విచారణ విషయంలో కవిత, కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు సరిగా డీల్ చేయలేదని, పార్టీ అధినేతకు నోటీసులు ఇస్తే ఇలాగేనా స్పందించేది అని ఆమె పరోక్షంగా కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాజకీయ కక్షతో నోటీసులు జారీ చేశారని విమర్శించారు. ఈ సందర్భంలో కవిత తన తండ్రి వెనుక నిలబడినప్పటికీ, పార్టీలో ఆమె పాత్రపై సందిగ్ధం కొనసాగుతోంది.
తెలంగాణ జాగృతి ద్వారా కవిత బీసీ రిజర్వేషన్లు, మహిళా సాధికారత వంటి అంశాలపై ఉద్యమాలు చేపడుతున్నారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్‌ను జాగృతి అనుబంధ సంస్థగా ప్రకటించి, బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఈ చర్యలు కవిత బీఆర్ఎస్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి లేదంటే సొంత పార్టీ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చూస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం కుటుంబ రాజకీయాలకే పరిమితం కాకుండా, తెలంగాణ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.