వాట్ ఈజ్ దిస్ కేసీఆర్ గారూ..!?

కేసీఆర్.. ఈ పేరు ఒక సంచలనం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా పోరాడి సాధించిన వ్యక్తిగా కేసీఆర్ కు పేరుంది. 14 ఏళ్లపాటు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేశారాయన. ఆ తర్వాత పదేళ్లపాటు ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ పార్టీలకు పని ఉంటుంది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికోసం పాటుపడాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో కేసీఆర్ రూటే సెపరేటు.
ఇప్పుడు తెలంగాణలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ లాంటి జిల్లాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఊళ్లలోని జనం నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. కేంద్ర మంత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మాత్రం ఇప్పటివరకూ వరదలపై కనీసం స్పందించలేదు. పార్టీ తరపున సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కేడర్ కు పిలుపు కూడా ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో ధైర్యం చెప్పాల్సిన కేసీఆర్.. కనీసం పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫాంహౌస్ లో ఆయన ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. కుమారుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. తండ్రీకొడుకులిద్దరికీ తెలంగాణ ప్రజలను పట్టించుకునే తీరిక లేదని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.
అధికారంలో పదేళ్లపాటు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తీరు ఇలాగే ఉండేది. పెద్దగా సెక్రటేరియేట్ కు వెళ్లేవాళ్లు కారు.. హైదరాబాద్ నగరం నీట మునిగినా ఏరోజూ ప్రగతిభవన్ దాటి బయటకు రాలేదు. కొండగట్టు వద్ద ప్రమాదంలో 50మంది చనిపోయినా కనీసం బాధితులను పరామర్శించలేదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇప్పుడు తెలంగాణను వరద ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం స్పందించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పదేళ్లపాటు ప్రజలు పట్టం కడితే వాళ్ల పట్ల కేసీఆర్ కు ఉన్న బాధ్యత ఇదేనా నిలదీస్తున్నారు. కానీ ఇలాంటి వాటిని కేసీఆర్ ఏమాత్రం కేర్ చేయరు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా తన ఫాంహౌస్ లో తనపని తాను చేసుకుంటూ పోతుంటారు.. అంతే..!!