Kavitha: కవిత ఎవరికోసం పని చేస్తోంది..?!!

బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha) ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటికొచ్చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కవిత కూడా అంతే ఘాటుగా, వేగంగా స్పందించారు. పార్టీ వద్దనుకున్నప్పుడు నేను ఎందుకు ఉంటానంటూ ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఈ ఎపిసోడ్ అంతా డ్రామా అనే టాక్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న హరీశ్ రావును (Harish Rao) సాగనంపేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడుతున్న డ్రామా అనేవాళ్లున్నారు. కవితను బయటకు పంపించి ఇలా హరీశ్ రావుపై ఆరోపణలు చేయడం ద్వారా పొగపెట్టాలనేది వాళ్ల ఉద్దేశమని చెప్తున్నారు. అవినీతి మరక అంటిన తర్వాత హరీశ్ రావు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తనంతట తానే పార్టీ నుంచి బయటకు రావచ్చు. లేదంటే పార్టీలో ఆయన చుట్టూ అనుమానపు మేఘాలు కమ్ముకుంటాయి. ఎలాగైనా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. తద్వారా ఆయన్ను బయటకు పంపడమో, తనంతట తానుగా వెళ్లేలా చేయడమో కల్వకుంట్ల ఫ్యామిలీ టార్గెట్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇక రెండోది కవితను కాంగ్రెస్ పార్టీ (Congress) ఆడిస్తోందనే ఊహాగానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని ఉనికిలో లేకుండా చేయాలనని రేవంత్ రెడ్డి (Revanth Reddy) భావిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందుకోసం కవితను బయటకు రప్పించి ఆమె ద్వారా పార్టీని టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ ఇరకాటంలో పడుతుందని, ఇది అంతిమంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరు భావిస్తున్నారు. అందుకే కవితతో సత్సంబంధాలున్న రేవంత్ రెడ్డి ఈ స్కెచ్ వేశారని.. ఆ వ్యూహంలో భాగంగానే కవిత బయటకొచ్చారని కొందరు అనుమానిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే కవిత కాంగ్రెస్ లో చేరి కీలక పదవులు పొందే వీలుంటుంది.
ఈ రెండు ఊహాగానాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత వాస్తవం ఉందో ఎవరికీ తెలీదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. కుటుంబాలు చీలిపోయి ఎవరి స్వార్థం వాళ్లు చూసుకోవచ్చు. ఇందుకో వైఎస్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ పెద్ద ఉదాహరణలు. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా అందులో చేరింది. అంతే..! అయితే కవిత ఎపిసోడ్ లో ఎవరున్నారు.. ఆవిడ ఎవరికోసం పని చేస్తున్నారనేది మున్ముందు తెలుస్తుంది.