BRS: బీఆర్ఎస్కు కష్టకాలం.. ఎక్కడ పట్టు తప్పింది..?
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి (BRS) ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైనప్పటి నుంచి, ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, బీఆర్ఎస్ పట్టు గట్టిగా ఉందని భావించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన రెండు కీలక ఉపఎన్నికల్లో ఓటమి పాలవడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది. పార్టీ నాయకత్వం, అంతర్గత కలహాలు, కాంగ్రెస్ వ్యూహాల ముందు నిలబడలేకపోవడం వంటి కారణాలన్నీ బీఆర్ఎస్కు కష్టకాలాన్ని సూచిస్తున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీచింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పట్టణ ఓటర్లు, సెటిలర్లు మాత్రం బీఆర్ఎస్కే మద్దతు పలికారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్కు కంచుకోటగా మారిందని విశ్లేషకులంతా భావించారు. అయితే, ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు ఈ విశ్లేషణను తలకిందులు చేశాయి.
2023లో బీఆర్ఎస్ గెలుచుకున్న ఈ రెండు స్థానాలను ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ రెండు అర్బన్ సీట్లను కోల్పోవడం బీఆర్ఎస్కు అస్సలు మింగుడుపడని అంశం. గ్రేటర్ పరిధిలో కూడా బీఆర్ఎస్ పట్టు సడలిపోతుందని, కాంగ్రెస్ బలం ఊహించిన దాని కంటే వేగంగా పెరుగుతుందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే సీఎం రేవంత్ రెడ్డి పనైపోయిందని, ఎప్పుడైనా గెలుపు బీఆర్ఎస్దేనని ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటనలు ఒట్టిమాటలేనని ఉపఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రభావం కనిపించకపోవడం బీఆర్ఎస్ నేతల మాటలకు, వాస్తవాలకు మధ్య ఉన్న అగాధాన్ని చూపిస్తోంది.
పార్టీకి ఎదురవుతున్న ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణాల్లో మరొకటి పార్టీ అధినేత కె.సి.ఆర్. మౌనం వహించడం. 2023 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరమై, ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. కేసీఆర్ అసెంబ్లీకి కూడా హాజరుకాకపోవడం పార్టీ శ్రేణులకు, ప్రజలకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినేత చురుగ్గా ఉండి, ప్రజల పక్షాన పోరాడాల్సి ఉన్నా, కేసీఆర్ మౌనం వల్ల పార్టీపై నమ్మకం సడలుతోంది. కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నా, కేసీఆర్ లేని లోటు పార్టీని బలహీనపరుస్తోంది.
మరోవైపు, కేసీఆర్ కుటుంబ వివాదాలు కూడా బీఆర్ఎస్ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కుమార్తె కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆమె బహిరంగంగా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించడం పార్టీని ఇరకాటంలో పెట్టింది. జూబ్లీహిల్స్‌లో ఓటమి తర్వాత కవిత ‘కర్మ హిట్స్ బ్యాక్’ అని ట్వీట్ చేయడం కుటుంబంలో నెలకొన్న తీవ్రమైన గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది. సొంత కూతురికే న్యాయం చేయలేని వాళ్లు రాష్ట్రానికి ఏం చేస్తారు? అనే విమర్శలకు బీఆర్ఎస్ నేతల వద్ద సమాధానం లేకుండా పోయింది.
బీఆర్ఎస్ ఓటమికి, ప్రస్తుత కష్టకాలానికి కేసీఆర్ కుటుంబ అవినీతిపై వచ్చిన ఆరోపణలు కూడా ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత, ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్, కాళేశ్వరం కేసులో కేసీఆర్ వంటివారు ఆరోపణలు ఎదుర్కోవడం ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెరగడానికి దారితీసింది. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ పదేపదే చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ఆరోపణలు కూడా ఆ పార్టీకి సమస్యగా మారాయి.
మరో కీలకమైన అంశం సీమాంధ్రులు, సెటిలర్ల వైఖరిలో మార్పు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఈ వర్గం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభిమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్లంతా కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఎన్టీఆర్ లాంటి వారికి విగ్రహం పెడతామని రేవంత్ ప్రకటించడం, టీడీపీపై గతంలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను ప్రజలు గుర్తు చేసుకోవడం, ఆ విమర్శలు ఇప్పుడు బీఆర్ఎస్కు బూమరాంగ్ అయినట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ డైలమాలో పడింది.
మొత్తంగా చూస్తే, బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న సవాలక్ష కారణాలకు.. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు, వ్యక్తిగత వ్యూహాలు కూడా తోడయ్యాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలు, దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఆదరణ పొందాయి. రేవంత్ దూకుడు ముందు బీఆర్ఎస్ నిలదొక్కుకోలేక పోతోంది. సరైన ప్రణాళిక, అధినాయకుడి చురుకైన భాగస్వామ్యం, ప్రజా సమస్యలపై పోరాటం లేకపోవడం వంటి కారణాల వల్ల, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.






