KCR: కేసీఆర్ వస్తున్నారు…? సిగ్నల్ ఇచ్చేసారా…?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మళ్ళీ రంగంలోకి దిగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. రాజకీయంగా భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించడం ఇదే సమయంలో బిజెపి (BJP) కూడా తెలంగాణలో బలపడే అవకాశం వెతుక్కోవడంతో గులాబీ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. తెలంగాణలో ప్రభుత్వ మారిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. పదేపదే సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రెచ్చగొడుతున్న సరే కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.
రాజకీయంగా భారత రాష్ట్ర సమితికి కేసిఆర్ దూకుడు కావాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఆయన ముప్పతిప్పలు పెట్టారు. అలాంటి నేత ఇప్పుడు సైలెంట్ గా ఉండటం గులాబీ పార్టీని మరింత కలవరపెడుతోంది. అయితే తాజాగా కెసిఆర్ చాలా రోజుల తర్వాత మీడియా ముందు కనిపించారు. తన సోదరి మరణించడంతో ఆమెకు నివాళులు అర్పించేందుకు వెళ్లారు. కేసీఆర్.. పార్టీ నేతలు కేటీఆర్ అలాగే హరీష్ రావు మరికొంతమంది నేతలతో కలిసి తన సోదరికి నివాళులర్పించారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కేసీఆర్ అంత సౌకర్యవంతంగా ఉన్నట్లు కనబడలేదు. ఆయన ముఖంలో హావభావాలు కూడా గతంలో మాదిరిగా లేవు అనే అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ కచ్చితంగా మళ్ళీ దూకుడు పెంచే అవకాశం ఉందని ఆయన జిల్లా వ్యాప్త పర్యటనలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ బయటకు రాకపోతే మాత్రం కచ్చితంగా గులాబీ పార్టీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
ప్రస్తుతం గులాబీ పార్టీ కేసులతో ఇబ్బంది పడుతోంది. కేటీఆర్ ను ఎప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంటుందో అనే భయమూ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి టైంలో కేసీఆర్ బయటకు వస్తే కచ్చితంగా పార్టీ నేతలలో మనోధైర్యం పెరగడమే కాకుండా కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ ఇబ్బంది పెట్టవచ్చు. కెసిఆర్ ప్రసంగాలకు మీడియాలో కచ్చితంగా వెయిట్ ఉండటంతో ఆయన బయటకు రావాలని కోరుతున్నారు పార్టీ కార్యకర్తలు, నేతలు. మరి ఇప్పుడైనా కేసీఆర్ బయటకు వస్తారా లేదా అనేది చూడాలి.