World Telugu Conference: ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు భారీ ఏర్పాట్లు

ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖుల రాక
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, వారిలో సోదరభావం, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం మరియు భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను(World Telugu Conference) జనవరిలో నిర్వహిస్తోంది. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా దత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభల కోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.
తెలుగు టైమ్స్‌తో సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ మాట్లాడుతూ, సమావేశం ప్రారంభదినంనాడు జనవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని చెప్పారు. జనవరి 5వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కూడా ఈ మహాసభలకు ఆహ్వా నించినట్లు ఇందిరాదత్ తెలియజేశారు. రాజకీయ నాయకులతోపాటు సినీ ప్రముఖులు కూడా ఈ మహాసభ లకు వస్తున్నారని ఆమె తెలియ జేశారు. చిరంజీవి, రాఘవేంద్ర రావు తదితరులతోపాటు పలువురు సినీ ప్రముఖులు వస్తున్నారని ఆమె చెప్పారు.
మరోవైపు ఈ తెలుగు మహాసభల కోసం ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా తెలుగుజాతి వ్యాపారాభివృద్ధికి తద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ, ‘సంఫీుభావమే బలం’ అన్న నినాదంతో నిరంతరం తెలుగుజాతి పురోగతికి పాటుపడుతున్న ‘ప్రపంచ తెలుగు సమాఖ్య’. 1993లో ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు వివిధ చోట్ల అనేక కార్యక్రమాలతో పాటు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ‘అంతర్జాతీయ తెలుగు మహాసభలు’ నిర్వహిస్తూ వస్తోంది. ఇంతవరకు వివిధ రాష్ట్రాలలో, విదేశాలలో పదకొండు ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ, విశాఖపట్నం, సింగపూరు, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేసియాల తదితర ప్రాంతాల్లో జరిగాయి. ఈ మహాసభల ఏర్పాట్లకోసం గత కొద్దినెలలుగా వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాల నిర్వహణకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగే ఈ సమావేశాలకు ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను కూడా ఆహ్వానించి సత్కరించనున్నారు. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం మరియు వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీకళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. యునికార్న్ కంపెనీలు స్టార్టప్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. రాపిడో లాంటి స్టార్టప్ కంపెనీలు ఈ మహాసభలకు హాజరై తమ కార్యకలాపాలను తెలియజేయనున్నాయి. మలేషియా నుంచి 50 మందికిగా పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.
అన్నీ దేశాల్లో ఉన్న తెలుగువారితోపాటు, అక్కడ ఉన్న తెలుగు సంఘాలను కూడా తాము ఆహ్వానిస్తున్నామని ఇందిరా దత్ తెలియజేశారు. ఇప్పటికే మాకు అనేక చోట్ల నుంచి చాలామంది ఈ సభలకు రావడానికి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఈ సభలకు అందరిని రావాల్సిందిగా మరోసారి ఆహ్వానిస్తున్నాము. తెలుగు టైమ్స్ కూడా ఈ మహాసభల్లో చురుగ్గా పాల్గొంటున్నది. అమెరికా లోని తెలుగువారి పత్రికగా పేరు పొందిన తెలుగు టైమ్స్ ద్వారా కూడా అమెరికాలో ఉన్న విదేశాంధ్రులను ఆహ్వాని స్తున్నాము.
ప్రపంచ తెలుగు సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కవిత దత్ మాట్లాడుతూ ఈ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 10 మందికి బిజినెస్ యాచీవర్ అవార్డులు ఇవ్వనున్నాము. అదే విధంగా తమ తమ కంపెనీల ద్వారా సేవ – దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ) అవార్డ్స్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు పద్య సౌరభాలు, హాస్య వల్లరి ప్రోగ్రాం లు, కూచిపూడి నాట్య ప్రదర్శనలు, తెలుగు జానపద విన్యాసాలు, రూపకాలు మున్నగు అనేక కార్యక్రమాలు ఉంటాయని, బిజినెస్ ప్రముఖులతో పానెల్ డిస్కషన్ కూడా ఉంటుందని చెప్పారు. అందరు వెంటనే తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని శ్రీమతి కవిత కోరారు. www.worldtelugu.com లో ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.