Anjan Kumar Yadav: అంజన్ కుమార్ అలక.. కాంగ్రెస్‌కు తలనొప్పి!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) టికెట్ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీలో అగ్గి రాజేసింది. సీనియర్ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) అలక పూనారు. ఆగ్రహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంపై పరోక్షంగా సవాల్ విసిరారు. దశాబ్దాల సేవను విస్మరించారంటూ ఆయన చేసిన ఆరోపణలు పార్టీలో నెలకొన్న పాత-కొత్త నాయకుల మధ్య అంతర్గత పోరాన్ని బయటపెట్టాయి.
40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు అంకితమై పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్, ఉప ఎన్నిక టికెట్ కేటాయింపులో తనను కనీసం సంప్రదించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన విమర్శలు హైలైట్‌గా మారాయి. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలోనే స్థానిక, స్థానికేతర అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారని అంజన్ నిలదీశారు. గతంలో రేవంత్ రెడ్డి కామారెడ్డి, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు ఈ స్థానిక వాదం ఎందుకు అడ్డు రాలేదని ప్రశ్నించారు. తద్వారా తనకు టికెట్ దక్కకపోవడానికి వ్యక్తిగత వైరం కారణమని పరోక్షంగా ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తనను ఘోరంగా అవమానించిందని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తనకు టికెట్ రాకుండా అడ్డుపడినదెవరో త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. అంతేకాక, కష్టకాలంలో పార్టీని నమ్ముకున్నా, తనకు తగిన గౌరవం దక్కలేదని, కనీసం నియోజకవర్గ కమిటీలో కూడా తనకు స్థానం కల్పించలేదని వాపోయారు. “వాళ్లు మమ్మల్ని తొక్కుకుంటూ పోతే, మేం ఎక్కుకుంటూ పోతాం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీలో తన పట్టు, బలాన్ని నిరూపించుకుంటానని, అధిష్ఠానంపై తిరుగుబాటు చేయడానికైనా సిద్ధమేననే సంకేతాలు పంపారు.
అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి పార్టీపై ప్రభావం చూపుతుందని గ్రహించిన అధిష్ఠానం, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ స్వయంగా అంజన్ కుమార్ నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, నాయకుల ఎదుటే అంజన్ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
ఉప ఎన్నికల సమయంలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా, అంజన్ యాదవ్, యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు కావడం వల్ల, ఆయన అసంతృప్తి పార్టీ ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
అంజన్ కుమార్ యాదవ్ తన భవిష్యత్ నిర్ణయాన్ని కార్యకర్తలు, మద్దతుదారులతో చర్చించిన తర్వాతే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఈ వివాదం ఇంతటితో ముగియలేదని అర్థమవుతోంది. ఆయన నిర్ణయం ఈ ఉప ఎన్నికల ఫలితంపైనే కాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌లో పాతతరం నాయకుల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా నిర్దేశిస్తుంది.
అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ సీటు ఆశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు హామీ ఇస్తే ఆయన శాంతించే అవకాశాలున్నాయి. తన డిమాండ్లకు పార్టీ అంగీకరించకపోతే, ఆయన పార్టీ వీడి ఇతర పార్టీలో చేరడం లేదా ఉప ఎన్నికలో స్వతంత్రంగా పోటీ చేయడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఇది అధికార కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.