తెలంగాణ బడ్జెట్లో రైతు సంక్షేమం కోసం 26,831 కోట్లు!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి కే హరీష్ రావు ఈ రోజు(సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.2,90,396 కోట్ల అంచనాతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా ఉంది. అందులో కూడా అత్యధికంగా సాగు, జలవనరులు, విద్యా, వైద్య రంగానికి నిధులు కేటాయించినట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. “రాష్ట్ర సర్కార్ వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఫోకస్ చేసింది. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లను కేటాయించాం. అంతేకాదు సాగు విధానాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే దిశా నిర్దేశం చేస్తోంది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఆయా రాష్ట్రాల్లో రైతులు అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాంటే కేసీఆర్ సర్కాగ్ ఎంత రైతు పక్షపాతి ప్రభుత్వమో అర్థం చేసుకోండి” అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు.






