ఉన్నత చదువుల కోసం టెమ్రీస్‌కు రూ.85 లక్షల విరాళం

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (టెమ్రీస్)కి చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సీడ్-హెచ్‌హెచ్‌ఎఫ్ సంస్థ రూ.85 లక్షలు విరాళం ఇచ్చింది. టెమ్రీస్ సెక్రెటరీ అయేషా మస్రత్ ఖానంకు అమెరికాకు చెందిన సీడ్ సంస్థ ప్రతినిధి సయ్యద్ మజ్హరుద్దీన్ హుస్సేని ఈ చెక్కును అందజేశారు. ఇంజనీరింగ్, మెడికల్, ఐఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్ పిలానీల్లో డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లు పొందే టెమ్రీస్ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఐఐటీతో సహా ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ పొందిన ఐదుగురు, సీఏ, సీఎంఏలలో ఆరుగురికి ఫీజులు చెల్లించినట్లు తెలిపారు. గతేడాది సీడ్ సహకారంతో 11 మందికి ఫీజులు చెల్లించినట్లు ఆయేషా తెలిపారు. అందులో ముగ్గురు ముస్లియేతరులు ఉన్నారన్నారు. కుల, మత, వర్ణ విభేదం లేకుండా టెమ్రీస్ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళితే సీడ్ ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు.