Telangana Congress: ఎమ్మెల్యేల రహస్య సమావేశం.. తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని సంతోషపడుతున్న వేళ ఆ పార్టీకి పెద్ద ఝలక్ తగిలింది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో తాము ఇచ్చిన గ్యారంటీల అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body elections) కూడా సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా (MLAs Secret meeting) సమావేశమై ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై పీసీసీ (PCC) అప్రమత్తమైంది. రహస్యంగా సమావేశమైన ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతోంది. అయితే పలు అంశాలను అధిష్టానం (Congress high command) దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Jedcharla MLA Anirudh Reddy) ఆధ్వర్యంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఓ ఫాంహౌస్ లో రహస్యంగా సమావేశమయ్యారనే వార్త శనివారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahaboob Nagar), వరంగల్ (Warangal) జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేబినెట్లోని ఇద్దరు మంత్రుల వ్యవహారాల శైలిపై వీళ్లకు తీవ్ర అభ్యంతరాలున్నట్టు తెలుస్తోంది. వరంగల్ ఇన్ ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy), మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు (Jupalli Krishna Rao) వ్యతిరేకంగా వీళ్లంతా సమావేశమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పైన కూడా వీళ్ల అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది ఎమ్మెల్యేల ఆరోపణ.
జిల్లాలో తమ పనులు జరగకుండా మంత్రులు అడ్డు పడుతున్నారని.., నిధులు కేటాయించట్లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ (BRS) నేతలకు పనులు చేసి పెడుతున్నారని వీళ్లు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. దీనిపై ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) స్పందించారు. ఎమ్మెల్యేలు సమావేశమైన మాట వాస్తవమేనని.. అయితే పది మంది కాదని 8 మంది మాత్రమేనని ఆయన వివరించారు. తమ పనులు జరగట్లేదని వాళ్లు బాధపడుతున్నట్టు మల్లు రవి వివరించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Maheh Kumar Goud) వివరణ కోరినట్లు తెలిసింది. ఏదైనా ఉంటే తన దృష్టికి కానీ, సీఎం రేవంత్ దృష్టికి కానీ తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు సమాచారం.
తమ రహస్య సమావేశంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలు భేటీ అయిన మాట వాస్తవమేనని.. కానీ అది రహస్యం కాదని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించుకున్నట్టు తెలిపారు. తాను ఏ ఫైలూ మంత్రి ముందు పెట్టలేదని.. ఏ ఫైల్ ఉందో మల్లు రవినే అడగాలని అనిరుధ్ రెడ్డి తెలిపారు. అయితే పలు అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని నిక్కచ్చిగా చెప్పారు. త్వరలోనే దీప దాస్ మున్షీని (Deepa Dasmunshi) కలిసి వివరిస్తామన్నారు. దీంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నిజమేనని అర్థమవుతోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల రహస్య భేటీ తీవ్ర కలకలం రేపుతోంది. ఇది ఇంతటితో ముగుస్తుందా లేకుంటే మరింత ముదురుతుందా అనేది మున్ముందు తెలుస్తుంది.