Amaravathi: బంగారు కుటుంబాలు… జీరో పావర్టీ పీ-4 కార్యక్రమం..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu).. సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్.. ఏ నాయకుడైనా ప్రస్తుతం ఏం జరుగుతుంది.. తానేం చేయాలని ఆలోచిస్తాడు. ఈయన మాత్రం 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందన్నది గుర్తించి.. అందుకు అనుగుణంగా పథకాలు రచిస్తారు. గతంలో చంద్రబాబు సాఫ్ట్ వేర్ పరిశ్రమ అభివృద్ధికి అహరహం కృషి చేశారు. సైబరాబాద్ , హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్ని నిర్మించడంలో తనదైన పంధాలో ముందుకెళ్లారు. దీంతో చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఆయనో మార్గదర్శిగా నిలిచిపోయారు.
గతంలో 2020 అంటూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు 2047 అనే ట్యాగ్ లైన్ ప్రస్తావిస్తున్నారు. అప్పటికీ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలన్నది తన లక్ష్యమంటున్నారు.దీనిలో భాగంగా ఎలాంటి అవకాశం దొరికినా వినియోగించుకుంటూ వస్తున్నారు. మొన్నటివరకూ పి-3 మంత్రం జపించిన చంద్రబాబు.. ఇప్పుడు జీరో పావర్టీ పీ-4 ప్రస్తావిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా… జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులకు … క్యాంప్ కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మనసు విప్పి మాట్లాడారు. పీ-4 కార్యక్రమంపై తన ఆలోచనలను.. తాను పెట్టుకున్న లక్ష్యాలను పంచుకున్నారు. పీ4పై మార్గదర్శుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
“సంపన్నులు సాయం చేస్తే.. పేదరికం తగ్గుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 15 లక్షల మంది బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలనేది నా సంకల్పం. ఇందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలి. అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతోమందిని ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసేందుకు వారి జీవితంలో ఎవరో ఒకరు సాయం చేశారు. సమాజంలో విజయం సాధించిన అందరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలి. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాం. వీరికి సాయం చేసేందుకు 47 వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారు” అని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదలను ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలన్నదే నా సంకల్పం. పేదల భవిష్యత్ బంగారుమయం చేసేందుకు పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం” అని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు మార్గదర్శులు ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు.. ఆశయాలకు తాము అండగా ఉంటామని చెప్పారు.