దేశంలోనే ఏపీ అగ్రస్థానం : మేకపాటి

ఆక్వా, ఫార్మా, ఖనిజ రంగాల్లో దేశంలోనే ఆంధప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రిని ఏపీఐఐసీ చైర్‍పర్సన్ రోజా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు నెలకొన్నప్పటికీ 1.5 శాతం మేర వృద్ధి రేటు నమోదు చేసినట్లు తెలిపారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
జులైలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించామని, రెండో దశలో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు వస్తాయన్నారు. ఇప్పటికే కర్నూలు విమానాశ్రయం జాతికి అంకితం చేశామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్మలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైకాపా ఒప్పందాలు మాత్రమే చేసుకునే ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ రాబోతోందని స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఎస్సార్ స్టీల్ ముందుకొచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.