Jagan: కూటమిపాలనపై గళం విప్పుతున్న వైసీపీ..పక్కా స్కెచ్ తో జగన్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తాడేపల్లిలో (Tadepalli) ఉన్న కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నేతృత్వంలో భవిష్యత్ కార్యచరణపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి (Peddireddy Ramachandra Reddy), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy), సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తదితరులు పాల్గొన్నారు.
ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, పీఏసీ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొనడం విశేషం. సమావేశంలో ముఖ్యంగా టీడీపీ కూటమి ఏడాది పాలనలోని లోపాలపై చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయిన తీరును ప్రజల్లో బలంగా చాటి చెప్పాలన్న దిశగా యోచనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘సూపర్ 6’ పథకాల అమలులో తలెత్తిన ఆలస్యం, హామీలను విస్మరించిన విధానం వంటి అంశాలను పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించాలన్న నిర్ణయానికి వైసీపీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) వంటి పథకాలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదని, జూన్ లో అమలవుతాయన్న ప్రభుత్వ హామీ ఫలించలేదని విమర్శిస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం బాధ్యత వహించాలనే ఒత్తిడిని తాము పెంచాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే కాక, తమ పార్టీ నాయకులపై నమోదవుతున్న కేసులపై ఎలా స్పందించాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న దానిపై కూడా చర్చ జరిగింది.
ఇక ప్రభుత్వం కూడా తన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలకు పర్యటనల ప్రణాళిక సిద్ధం చేస్తుండగా, వైసీపీ కూడా అదే రకమైన కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఎవరు ఎక్కువగా విశ్వాసాన్ని పొందగలుగుతారో అన్నదే ఆసక్తికరంగా మారింది. జగన్ ఈసారి ప్రజల్లోకి మరోమారు బలమైన సందేశం పంపేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేలా కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.