కరోనా బాధితుల పట్ల వివక్ష చూపడం సరికాదు : వైఎస్ జగన్
కరోనా బాధితుల పట్ల వివక్ష చూపడం సరికాదని ఈ మహమ్మారి పట్ల ప్రజల్లో భయాందోళనను తొలగించాల్సిన అవసరం ఉందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణ చర్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ సహా ఇతర ఉన్నతాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
నిన్న ఒక్కరోజే 10,730 కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇప్పటివరకు 1,91,874 కొవిడ్ పరీక్షలు నిర్వహించామన్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్లో కరోనా కలకలం రాష్ట్రంలో 4 జిల్లాల్లో ప్రభావం చూపుతోందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం సేకరణకు ముమ్మరం ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎన్ని సమస్యలు ఉన్నా రైతులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పారు. చేపలు, రొయ్యల ఎగుమతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.






