YS Jagan: దొంగకు జగన్ క్లీన్ చిట్? ఆయన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలోని పరకామణీలో (Parakamani) జరిగిన అవకతవకలు, చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ (Ravi Kumar) వ్యవహారాన్ని వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సమర్థించిన తీరు ఇప్పుడు అంతకంటే పెద్ద చర్చనీయాంశంగా మారింది. కలియుగ దైవం సన్నిధిలో జరిగిన అపచారాన్ని ఖండించాల్సింది పోయి, అదొక చిన్న విషయం అన్నట్లుగా జగన్ మాట్లాడడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సామాన్య భక్తుల్లోనూ విస్మయం కలిగిస్తోంది.
పరకామణీలో పనిచేసిన రవికుమార్ శ్రీవారి హుండీ కానుకలను అపహరించారన్నది ప్రధాన ఆరోపణ. అయితే, ఈ విషయంపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. రవికుమార్ తన ఆస్తులను టీటీడీకి రాసిచ్చారని, అంత మంచి పని చేసిన వ్యక్తిని వేధించడం సరికాదన్న ధోరణిలో మాట్లాడారు. దీనిపై అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. దొంగతనం బయటపడ్డాక, జైలు శిక్ష తప్పించుకోవడానికో లేదా రాజీ కోసమో ఆస్తులు రాసిస్తే.. ఆ దొంగ దాతగా మారిపోతాడా? అన్నదే వారి ప్రశ్న. దొంగతనాన్ని, దొంగను సమర్థించేలా ఒక మాజీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం నైతిక విలువలకు పాతర వేయడమేనని పలువురు మండిపడుతున్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని కోరాల్సింది పోయి, వారిని వెనకేసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
జగన్ ఈ కేసును అంత తేలికగా తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవికుమార్ నుంచి సుమారు రూ. 13 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీ పేరున రాయించి, ఈ కేసును అక్కడితో ముగించే ప్రయత్నం గత ప్రభుత్వ హయాంలో జరిగిందనే విమర్శలున్నాయి. అయితే, బయటపడింది 13 కోట్లు మాత్రమేనని, కానీ తెరవెనుక వైసీపీ ముఖ్య నేతలు రవికుమార్ నుంచి భారీగా ఆస్తులను దండుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆస్తుల బదలాయింపు పేరుతో రవికుమార్ తో రాజీ కుదుర్చుకుని, అసలు దొంగలను, ఆ సొమ్మును పంచుకున్న పెద్దలను కాపాడే ప్రయత్నం జరిగిందన్న వాదనలకు జగన్ తాజా వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
ఈ వ్యవహారం కేవలం డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఏవీఎస్వో (AVSO) సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకవైపు ఈ కేసుపై సీఐడీ (CID) దర్యాప్తు చేసి, ఇటీవలే హైకోర్టుకు నివేదిక సమర్పించింది. న్యాయస్థానం పరిధిలో ఉన్న ఒక సీరియస్ క్రిమినల్ కేసును, అందులోనూ అనుమానాస్పద మరణం ముడిపడి ఉన్న అంశాన్ని జగన్ చిన్న విషయంగా కొట్టిపారేయడం న్యాయవ్యవస్థను అగౌరవపరచడమే అవుతుందన్న అభిప్రాయం న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. సాక్షులను భయభ్రాంతులకు గురిచేసేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం సరికాదన్న వాదన బలంగా ఉంది.
తిరుమల వెంకన్న సొమ్మును కాజేయడం అంటే భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే. అటువంటి కేసులో నిందితుడిని వెనకేసుకు రావడం ద్వారా జగన్.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏం చేసినా సమర్థిస్తాననే సంకేతాలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది పరోక్షంగా అవినీతికి, అక్రమాలకు లైసెన్స్ ఇవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “మా వాడు దొంగే కావచ్చు, కానీ మాకు కావాల్సిన వాడు” అనే రీతిలో జగన్ వ్యవహార శైలి ఉండడం విడ్డూరంగా ఉంది. మొత్తానికి, పరకామణీ చోరీ వ్యవహారంలో జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఆత్మరక్షణలో పడేశాయి.






