Amaravathi: తాము చేస్తే సంసారం.. ఎదుటోళ్లు చేస్తే మాత్రం పెద్ద తప్పా.. ఏంటిది జగన్..?

వైసీపీ పాలన సమయంలో మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టి , వారిని గాయపరిచేందుకు ప్రయత్నించారు. ఈవ్యవహారం అప్పట్లో చాలా సీరియస్ అయింది. దీంతో ఈ ఘటనను అప్పట్లో టీడీపీ.. కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. అప్పట్లో వైసీపీ హవా అలా ఉంది మరి. బళ్లు ఓడలు .. ఓడలు బళ్లు అవుతాయన్న సామెత.. ఎప్పుడూ రాజకీయాల్లో కచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి పవర్ లో ఉండగా.. వైసీపీ విపక్షానికి చేరింది. ఇప్పుడు సేమ్ సీన్.. కాకపోతే.. ఆబాధ ఇప్పుడు వైసీపీ అధినేతకు తెలుస్తోందంతే..!
పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా ఆగస్టు 6న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నేత వేల్పుల రామలింగారెడ్డిపై దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు టీడీపీయే చేసిందని.. వైసీపీ ఆరోపించింది. ఈ దాడుల వెనక వైసీపీ హస్తముందని టీడీపీ ఎదురుదాడి చేసింది. అయితే ప్రస్తుతం దాడి వైసీపీ లీడర్ పై జరిగింది కాబట్టి.. దీని వెనక కచ్చితంగా టీడీపీ నేతల హస్తముందన్న ప్రచారం జోరందుకుంది. దీన్ని ప్రదానంగా ప్రస్తావించిన వైసీపీ అధినేత జగన్.. ఇది టీడీపీ అధికార దుర్వినియోగం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తున్నారని మండపడ్డారు. “ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే పోలీసులు దౌర్జన్యాలు మొదలుపెట్టారు. గతంలో ఎలాంటి కేసులు లేని వారిపై కూడా బైండోవర్ కేసులు పెట్టి వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు” అని ఆరోపించారు.
దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా, బాధితులైన వేల్పుల రాముతో పాటు మరో 50 మందిపై ఆగస్టు 6న మధ్యాహ్నం 3:30 గంటలకు తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని జగన్ ఆరోపించారు. “ఆగస్టు 8న మా పార్టీ నేతను బెదిరించి, ప్రలోభపెట్టి ఫిర్యాదు తీసుకుని రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే రోజున పులివెందులలో వైసీపీకి ఓట్లు వేసే సుమారు 4,000 మంది ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు, పోలింగ్ బూత్‌లను గ్రామాలకు 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి మార్చారు. బూత్ కబ్జా, రిగ్గింగ్‌కు ఆస్కారం కల్పించారు” అని ఆయన విమర్శించారు.