Donald Trump: మేమిద్దరం మాట్లాడుకుంటాం .. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం

అదనపు సుంకాల మోతతో సంబంధాలు దెబ్బతిన్నవేళ మళ్లీ సుహృద్భావ వాతావరణం చిగురించే సంకేతాలు భారత్ (India) , అమెరికా (America)ల నోట వెలువడ్డాయి. కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు రెండు దేశాల సారథులు తెలిపారు. నాకెంతో మంచి మిత్రుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో రాబోయే వారాల్లో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. అడ్డంకుల్ని అధిగమించుకుని ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరుపక్షాలూ చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి తానెంతో సంతోషిస్తున్నానని చెప్పారు. రెండు గొప్పదేశాల మధ్య విజయవంతమైన ఒప్పందం కుదరడంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదనేది తన నిశ్చితాభిప్రాయమని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంపై ఉభయపక్షాల కృషి కొనసాగుతోందని, డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు తాను ఎదురుచూస్తున్నానని మోదీ తెలిపారు.