Jagan: అసెంబ్లీ లో జగన్.. ఏపీ రాజకీయాలపై ఉత్కంఠను పెంచుతున్న పరిణామం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది. కొత్త కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నోసారి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ జగన్ మాత్రం బడ్జెట్ సమావేశం ఒక్కటే హాజరయ్యారు. అయితే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలనే డిమాండ్ చేశారు. దీనిపై కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జగన్ అసెంబ్లీకి రానున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఇంతకాలం జగన్ లేకుండా సాగిన సభకు ఇప్పుడు ఆయన హాజరైతే అక్కడ కనిపించే దృశ్యం ఎలా ఉంటుందో అనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) – జగన్ మధ్య రాజకీయ పోరు ఎంతో మందిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మరోసారి రీపీట్ కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – జగన్ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ అసెంబ్లీలో ప్రత్యక్షంగా తలపడలేదు. అలాగే నారా లోకేష్ (Nara Lokesh) కూడా జగన్‌తో ముఖాముఖీగా సభలో తగాదాలకు దిగలేదు. ఈ సారి వీళ్లంతా ఒకేసారి ఒకే వేదికపై ప్రత్యక్షమవుతారని అంటున్నారు.
జగన్ అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారు అన్న దానిపైనూ చర్చ జరుగుతోంది. గత ఏడాది రాలేకపోయినా ఈసారి మాత్రం రావాలనే ఉద్దేశం ఉండవచ్చని అనుకుంటున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా ఆయన సభలో ఉండాలని ఆశపడుతున్నారు. అది కూడా ఒక కారణమే కావచ్చు. మరోవైపు జగన్ మైక్ ఇవ్వడం, మాట్లాడే సమయం వంటి అంశాల్లో తనకు ఎలా అవకాశాలు వస్తాయో అనేది ప్రత్యక్షంగా చూపించాలని భావిస్తున్నారట.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం నెమ్మదిగా సాగింది. జనంలో కొన్ని విషయాల్లో ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం సడల లేదు . కానీ ఇప్పుడు రెండవ సంవత్సరం మొదలైంది. ప్రజల్లో ఫీల్ మారుతున్నట్టే కనిపిస్తోంది. జగన్ ఓడినా జనంలో ఆయనకు మద్దతు ఉందన్నదే తాజా అభిప్రాయం. ఇప్పటికే ఆయన నిర్వహించిన కొన్ని సభలకు వచ్చిన జనాలు చూస్తే అది స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే సింపతీ ఓటు కూడగట్టుకునే అవకాశముంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేసే సమయంలో జగన్ ని అడ్డుకుంటే ఆ ప్రభావం బహిరంగంగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ పక్క జగన్ పాదయాత్రలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ అసెంబ్లీ సెషన్ ఎలా సాగుతుందో అనేది జగన్ భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా మారనుందని అంటున్నారు.