పాదయాత్రలో ఇచ్చిన హామీని.. మూడోసారీ అమలు చేసిన సీఎం జగన్

ఓవైపు కోవిడ్ సంక్షోభం చుట్టుముట్టి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అంతంతే ఉన్నా…. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజలకిచ్చిన మాట నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని వరుసగా మూడోసారి అమలు చేసి చూపించారు. వరుసగా మూడో యేడాది కూడా సీఎం వైఎస్ జగన్ ‘వాహేన మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 2 లక్షలకు పైగా ఉన్న లబ్ధిదారులకు 248.47 కోట్లను నేరుగా వారి వారి అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… సొంత వాహనంతో చాలా మంది డ్రైవర్లు ప్రతి రోజూ ప్రజలకు సేవలందిస్తూ, ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతున్నారని ప్రశంసించారు. పెనాల్టీలు ఎక్కువవుతున్నాయని, ఇన్సూరెన్స్ కట్టలేకపోతున్నామని పాద యాత్ర సమయంలో మొరపెట్టుకున్నారని, ఆ రోజే ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చానని, ఇప్పుడు దీనిని మూడో యేడాది కూడా అమలు చేస్తున్నామని జగన్ వివరించారు. ఈ పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు 10 వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు. 2,48,468 మంది లబ్ధిదారులకు 248.47 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. వాహనాలకు బీమా చేయించడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, రిపేర్లతో పాటు తదితర అవసరాల నిమిత్తం ఈ సాయం చేస్తున్నామని, ఇలా చేస్తే డ్రైవర్లకు ఇబ్బందులు ఉండవని, అన్ని అనుమతులూ ఉంటే చలాన్లు కట్టే పరిస్థితి కూడా ఉండదని పేర్కొన్నారు. దౌర్జన్యం, జులం ఎక్కడా లేకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అయినా ప్రతిపక్షాలు విమ్శిస్తున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు.
నెల గడువు ఇస్తున్నాం… దరఖాస్తు చేసుకోండి….
ఇప్పటికీ ఎవరైనా దరఖాస్తు చేసుకోకుంటే ఆందోళన చెందవద్దని సీఎం భరోసా ఇచ్చారు. మరో నెల పాటు గడువు ఇస్తున్నామని, అర్హులైన వారు గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్ కోరారు. ఈ పథకంపై ఏవైనా సందేహాలుంటే 1902 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి, సందేహాలు తీర్చుకోవచ్చని ప్రకటించారు. అంతేకాకుండా టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామని, ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ భరోసా కల్పించారు.
వాహనాలను జాగ్రత్తగా నడపండి…...
క్యాబ్, ఆటో డ్రైవర్లందరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సీఎం జగన్ కోరారు. తమ తమ వాహనాలను కండీషన్‌లో పెట్టుకోవాలని, మద్యం సేవించి ఎవరూ నడపకూడదని సీఎం జగన్ అభ్యర్థించారు. మీ కుటుంబాలతో పాటు ప్రయాణికుల కుటుంబాలు కూడా బాగుండాలన్నది తమ అభిమతమని సీఎం జగన్ పేర్కొన్నారు.