YS Jagan: రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాలకు తెర.. జగన్ సంచలన ఆరోపణలు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC)తో ఆయన ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో (YCP Office) సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం (NDA Govt) రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతిని ప్రజల ముందుకు తీసుకెళ్లకుండా దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu arrest) అరెస్ట్ ను జగన్ తీవ్రంగా ఖండించారు. ముంబై నటి కాదంబరి జెత్వానీపై (Kadambari Jetwani) అక్రమ అరెస్ట్ ఆరోపణలపై ఆంజనేయులును హైదరాబాద్‌లో సీఐడీ (CID) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకు పరాకాష్ట అని జగన్ విమర్శించారు. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఆంజనేయులును మాత్రం లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలను చూస్తున్నాను. ఒక వ్యక్తిని ఇరికించడానికి తప్పుడు కేసులు సృష్టిస్తున్నారు.. సాక్ష్యాలను రూపొందిస్తున్నారు’ అని జగన్ అన్నారు.
రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారుతున్నాయని, దుష్ట సాంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం తెరలేపుతోందని జగన్ ఆరోపించారు. ‘ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ మిగలదు’ అని హెచ్చరించారు. అలాగే, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని (Mithun Reddy) కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఆయనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ వెల్లడించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి.. చంద్రబాబును ఎదిరించారు. అందుకే లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలతో వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు’ అని జగన్ విమర్శించారు.
లిక్కర్ విధానంపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్‌పై (Liquor Scam) సీఐడీ కేసు నమోదైందని, అయితే తమ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ విధానం విప్లవాత్మకమైనదని చెప్పారు. ‘ప్రైవేట్ దుకాణాలను తొలగించి, ప్రభుత్వమే లిక్కర్ విక్రయాలను నిర్వహించింది. అమ్మకాల సమయాన్ని తగ్గించాం. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? పెంచితే ఇస్తారా?’ అని జగన్ ప్రశ్నించారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్ఆర్‌సీపీ పోరాడుతుందని జగన్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తోందో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు ఈ అరాచకాన్ని గమనిస్తున్నారు అని ఆయన అన్నారు.