Jagan Padayatra: మళ్లీ పాదయాత్ర చేస్తా.. క్లారిటీ ఇచ్చేసిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పర్యటనల అనంతరం ఎన్నికల ముందు పాదయాత్ర (Padayatra) ద్వారా ప్రజలను కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యూత్ వింగ్ (Youth Wing) నేతలతో జరిగిన సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో వైసీపీ (YCP) కేడర్‌లో కొత్త ఉత్తేజం నెలకొంది. గతంలో జగన్ చేపట్టిన పాదయాత్రలు ఆయనకు, పార్టీకి ఎంతో బలాన్ని చేకూర్చాయి.
వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో పాదయాత్రలు కీలక పాత్ర పోషించాయి. 2009లో తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చి వైసీపీని స్థాపించారు. ఆ సమయంలో ప్రజల మధ్యకు వెళ్లడానికి ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర (Odarpu Yatra) ఆయనకు విస్తృతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ యాత్ర ద్వారా ఆయన తండ్రి మరణంతో ఆవేదనలో ఉన్న కుటుంబాలను కలిసి, ప్రజలతో మమేకమయ్యారు. ఈ యాత్ర వైసీపీ ఆవిర్భావానికి బీజం వేసింది.
అనంతరం, 2019 ఎన్నికలకు ముందు 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర (Praja Sankalpa Yatra) జగన్ రాజకీయ జీవితంలో మరో మైలురాయిగా నిలిచింది. 430 రోజుల పాటు 3,000 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో జగన్ 125 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు. “రావాలి జగన్, కావాలి జగన్” అనే నినాదంతో ఈ యాత్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజల సమస్యలను నేరుగా వినడం, వాటిని పరిష్కరించేందుకు హామీలు ఇవ్వడం ద్వారా జగన్ ప్రజాదరణ పొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి రావడానికి ఈ పాదయాత్ర ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమై, అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో, జగన్ మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. “రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీపడలేదు. ప్రజల సమస్యలకు అండగా నిలబడాలి” అని జగన్ యవనేతలకు పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ద్వారా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజల్లో వైసీపీ పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించడం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు తమ ప్రభుత్వం 99% మేనిఫెస్టో హామీలను నెరవేర్చినట్లు ఆయన గుర్తు చేశారు.
జగన్ పాదయాత్ర ప్రకటన వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమని, త్వరలోనే ప్రజల మద్దతు తిరిగి సంపాదిస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర ద్వారా ఆయన గతంలో మాదిరిగానే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మమేకం కానున్నారు. గత యాత్రల్లో ఆరోగ్యశ్రీ, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాలపై జగన్ దృష్టి సారించారు. ఈసారి కూడా ఇలాంటి సమస్యలను ఎత్తిచూపి, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తే అవకాశం ఉంది.
అయితే, ఈ పాదయాత్ర సవాళ్లు లేకపోలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ 40% ఓటు షేర్‌ను నమోదు చేసినప్పటికీ, 10% ఓట్లు కోల్పోయింది. ఈ ఓట్లను తిరిగి సంపాదించడం, పార్టీ కేడర్‌ను ఏకతాటిపై నడపడం జగన్ ముందున్న ప్రధాన సవాళ్లు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఇంతకుముందు లాగా సహకరిస్తుందా అనేది చూడాలి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ యువగళం పాదయాత్రకు అనేక ఆటంకాలు కల్పించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు జగన్ పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తుందా అనేది కూడా తెలియాలసి ఉంది. ఇప్పటికే జగన్ బయటకు వచ్చినప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది. గతంలో కోడికత్తి సంఘటనను కూడా లేవనెత్తే అవకాశం ఉంది.