టీటీడీ చైర్మన్ గా మేకపాటి రాజమోహన్ రెడ్డి ?

తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్టు బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్‍గా నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‍రెడ్డి నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. 2019 జూన్ 21వ తేదీ ఆయను టీటీడీ చైర్మన్‍గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో వారంలో రోజుల్లో ఆయన పదవీకాలం ముగుస్తుండడంతో టీటీడీ నూతన చైర్మన్ నియామకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది.
అయితే వైవీ సుబ్బారెడ్డి మరో ఏడాది పాటు తన పదవీ కాలాన్ని పొడిగించాలని వెంకటేశ్వర స్వామికి మరికొంత కాలం సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍ను కోరినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడం, కానున్న రెండేళ్లు మరింత కీలకం కావడంతో పార్టీ అధిష్టానం సుబ్బారెడ్డి సేవలను పార్టీ, ప్రభుత్వం పరంగా ఉపయోగించుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.