రాష్ట్రానికి 2 వేల మంది ప్రవాసాంధ్రులు
విదేశాల్లో చిక్కుకున్న వారిలో రాష్ట్రానికి వస్తున్న ఆంధ్రులు 2,000 మందికి పైగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రవాసాంధ్రుల వ్యవహారాలు) వెంకట్ మేడపాటి ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి రప్పించడానికి సీఎం వైఎస్ జగన్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డా. జైశంకర్‌కు పలుమార్లు ఈమెయిల్స్ పంపడంతో వారిని మంగళవారం నుంచి విమానాల్లో నేరుగా రాష్ట్రానికి పంపనున్నారని తెలిపారు. ఫిలిప్పీన్స్, యూఏఈ, యూకే, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, మలేసియా, ఐర్లాండ్, కజకిస్తాన్ నుంచి 13 విమానాలు మంగళవారం నుంచి జూన్ 1 వరకు నేరుగా ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకుంటాయన్నారు. వీరితో పాటు హైరాబాద్, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలకు ఏపీకి చెందిన 200 మంది పైగా ప్రయాణికులు వస్తున్నారని చెప్పారు. వారిని పరీక్షించి వైరస్ లక్షణాలున్న వారిని కోవిడ్ 19 ఆస్పత్రికి తీసుకువస్తారని వివరించారు. మిగిలిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ కోసం సంబంధిత జిల్లాకు తీసుకెళ్తారు.






