Vallabhaneni Vamsi: మళ్లీ గన్నవరం గడప తొక్కుతున్న వంశీ..! ఏంటి సంగతి..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. పరిచయం అక్కర్లేని పేరు. గన్నవరం (Gannavaram) గడ్డపై తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న నాయకుడు. టీడీపీలో (TDP) రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైసీపీ (YCP) పంచన చేరారు. గత ఐదేళ్లూ ఒక రేంజ్ లో చక్రం తిప్పారు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిణామాలు వంశీ రాజకీయ జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసాయి. ఓటమి, కేసులు, అరెస్టులు, జైలు జీవితం.. ఇలా వరుస దెబ్బలతో సైలెంట్ అయిన వంశీ, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. సుదీర్ఘ మౌనం తర్వాత వంశీ జనంలోకి వచ్చిన తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జై కొట్టిన వంశీ, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ లపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయన్ను టీడీపీకి టార్గెట్ గా మార్చాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీపై ఫోకస్ పెరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత వంశీపై ఏకంగా 11 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వంశీ, సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. నాయకుడు జైలులో ఉండటం, వరుస కేసులతో అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో గన్నవరంలో వంశీ వర్గం పూర్తిగా స్తబ్దుగా మారిపోయింది. విడుదలయ్యాక కూడా వంశీ కొంతకాలం ఇంటికే పరిమితం కావడంతో.. ఆయన పొలిటికల్ కెరీర్ పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
కానీ, వంశీ ఇప్పుడు గేర్ మార్చారు. నేను ఉన్నానంటూ మళ్ళీ గన్నవరం వీధుల్లోకి వస్తున్నారు. కేవలం రావడం మాత్రమే కాదు, మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉదయం మొదలుకొని రాత్రి వరకూ నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని చుట్టేస్తున్నారు. రోజుకు కనీసం 10 కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. కేవలం పలకరింపులకే పరిమితం కాకుండా, గత ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలపై వంశీ లోతుగా పోస్ట్ మార్టం చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో వైసీపీలో ఉన్న అంతర్గత వర్గ పోరు వల్లే తాను దెబ్బతిన్నానని గ్రహించిన వంశీ, ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు నియోజకవర్గ వైసీపీకి తానే ఏకైక నాయకుడిని కావడంతో, గతంలో దూరంగా ఉన్న అసమ్మతి వర్గాలను, అలిగి దూరమైన కార్యకర్తలను స్వయంగా పిలిచి కలుపుకుపోతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక తన అనుచరులపై నమోదైన కేసులు, వేధింపులపై వంశీ ప్రధానంగా దృష్టి సారించారు. కేసులకు భయపడొద్దు.. నేనున్నాను అంటూ క్యాడర్ లో ధైర్యం నింపుతున్నారు. లీడర్ ఫీల్డ్ లోకి రావడంతో డీలా పడ్డ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా వంశీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
మొత్తానికి ఓటమి, ఆ తర్వాత జైలు జీవితం తర్వాత వంశీ సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మరి ఈ ఇన్నింగ్స్ లో వంశీ గన్నవరంపై పట్టు సాధించి, పోయిన తన వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటారా? లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా గన్నవరం రాజకీయం మాత్రం మళ్ళీ వేడెక్కిందనే చెప్పాలి.






