Amaravati: అమరావతికి ఆర్ధిక భరోసా కోసమే బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు: నిర్మలా సీతారామన్
పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆర్ధిక మంత్రి 9 జిల్లాల్లోని ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించేందుకు వీలుగా బ్యాంకులు సహకరించాలని ఆదేశించారు. కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కావొద్దని జాతీయ బ్యాంకులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ లాంటి పరిశ్రమలకూ చేయూత ఇవ్వడం ద్వారా రైతులకు సహకరించాలని అన్నారు.
మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి లాంటి ఉత్పత్తులు ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలిస్తున్నారని రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే ఉద్యాన పంట ఉత్పత్తుల విషయంలోనూ ఇదే తరహాలో రైతులకు సహకారం అందించాలని స్పష్టం చేశారు. దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు దానికి మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని జాతీయ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు సూచించారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యత అని పేర్కొన్నారు. పూర్వోదయ స్కీమ్ కింద రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకంలో భాగంగా అభివృద్ధి రూ.39 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అమరావతికి ఆర్ధిక భరోసాగా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఓ యజ్ఞమని నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని పనుల రీస్టార్ట్ సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులకు ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని.. ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసాగా ఉండాలన్న నిర్ణయంతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాజధానిలో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని మోదీ వద్ద ఎప్పుడు ప్రస్తావించినా… వాటిని తక్షణం ఆమోదిస్తారని.. విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోన్న రాష్ట్రానికి పూర్తిగా సహకరించాలని చెప్పారని అన్నారు. క్వాంటం వ్యాలీతో పాటు రాష్ట్రంలో ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ లాంటి వాటిపై కూడా కేంద్రం ఆలోచన చేస్తోందని అన్నారు. భవిష్యత్ రాజధాని అమరావతి నగరంలో ఆత్యాధునిక ప్లానెటోరియం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవటం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరలోగా ఈ ప్లానెటోరియం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఏపీ ప్రజలెప్పుడూ సైన్సులో నిపుణులని.. గతంలో బెనారస్ యూనివర్సిటీలో సైన్సు విభాగంలో వారిదే అగ్రస్థానం అని వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జునుడి సైన్సు సూత్రాలను టిబెట్ లో కూడా చెప్పుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి రంగంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుందని దీనిలో ఏపీ కూడా పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు.






