YS Subba Reddy: వైవీ వ్యాఖ్యలతో సొంత గూటిలోనే గుబులు?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్రతకు మచ్చ తెచ్చిన పరకామణి దొంగతనం కేసులో మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YS Subba Reddy) సీఐడీ (CID) విచారణకు హాజరుకావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, విచారణ కంటే.. ఆ తర్వాత వైవీ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీ (YCP) వర్గాల్లో, ముఖ్యంగా నాటి టీటీడీ అధికారుల్లో కలవరం రేపుతున్నాయి. “ఆ విషయం నా పదవీకాలం ముగిశాకే బయటపడింది” అంటూ వైవీ చేసిన వ్యాఖ్యలు.. పరోక్షంగా తన తర్వాత బాధ్యతలు చేపట్టిన పాలకమండలిని, అప్పటి అధికారులను బోనులో నిలబెట్టినట్టయింది.
విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఉంది. “దొంగతనం ఎప్పుడు జరిగిందో, ఎవరు దాచిపెట్టారో నాకు తెలియదు. అది నా టర్మ్ పూర్తయిన తర్వాత వెలుగులోకి వచ్చిన వ్యవహారం” అని ఆయన తేల్చిచెప్పారు. ఇది సాంకేతికంగా ఆయనకు రక్షణ కవచం కావచ్చు. కానీ, రాజకీయంగా మాత్రం తన తర్వాత వచ్చిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డి హయాంలోనే వ్యవస్థలో లోపాలు జరిగాయని చెప్పకనే చెప్పినట్లయింది.
వైవీ సుబ్బారెడ్డి చైర్మన్గా వైదొలిగినప్పటికీ, ఈవోగా ధర్మారెడ్డి కొనసాగారు. ఇప్పుడు వైవీ “నాకు తెలియదు” అని చేతులు దులుపుకోవడంతో.. ఆ సమయంలో సర్వాంతర్యామిగా వ్యవహరించిన ఈవో ధర్మారెడ్డి, అప్పటి సీఎస్వో నరసింహ కిశోర్లపై అనుమానాలు మరింత బలపడే అవకాశముంది. ఇప్పటికే వీరిద్దరినీ సీఐడీ రెండు రోజుల క్రితం విచారించింది. ఇప్పుడు వైవీ స్టేట్మెంట్ వీరి వాదనలకు భిన్నంగా ఉంటే, దర్యాప్తు అధికారులు వీరిని మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. పరకామణిలో నిధుల గోల్ మాల్ లేదా దొంగతనం వంటి అంశాలు పాలకమండలి చైర్మన్ దృష్టికి రాకుండా అధికారులే మేనేజ్ చేశారా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగే అవకాశం ఉంది.
సాధారణంగా ఏ పార్టీ నేత అయినా తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, వైవీ సుబ్బారెడ్డి “నిష్పక్షపాత విచారణ జరిపి, అసలైన దోషులను కఠినంగా శిక్షించాలి” అని డిమాండ్ చేయడం గమనార్హం. దీని అర్థం.. తప్పు జరిగిందని ఆయన అంగీకరిస్తున్నట్లే లెక్క. అయితే ఆ తప్పు చేసింది తాను కాదని, మరెవరో అని చెప్పడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇది వైసీపీలోని అంతర్గత విభేదాలను, ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ధోరణిని బట్టబయలు చేస్తోంది.
మరోవైపు, ఈ కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను డిసెంబర్ 2వ తేదీలోగా హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. దీంతో సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి కీలక పత్రాలను విజయవాడకు తెప్పించుకుని మరీ విచారణ జరుపుతున్నారు. ఈ తరుణంలో వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు సీఐడీ నివేదికలో కీలకం కానున్నాయి.
మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి సీఐడీ విచారణకు హాజరై తన క్లీన్ చిట్ కోసం ప్రయత్నించినప్పటికీ, ఆయన మాటలు మాత్రం నాటి టీటీడీ యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. “నా పదవీకాలం కాదు” అనే ఒక్క మాటతో.. పరకామణి పాపాన్ని తన తర్వాతి వారి ఖాతాలో వేసేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేసులో అసలైన దోషులు ఎవరో తేలేసరికి ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో వేచి చూడాలి.






