Drone: అమ్మో డ్రోన్, తిరుపతిలో నేరస్తుల గుండెల్లో రైళ్ళు..!

ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ దెబ్బకు నేరస్థుల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి(Tirupati)లో డ్రోన్ దెబ్బకు భయపడిపోతున్నారు నేరస్తులు. గంజాయి, మద్యం, పేకాట ఇతరత్రా అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరా తో ప్రత్యేకమైన బీట్లు నిర్వహిస్తున్నారు పోలీసులు(Police). ఇటీవల రేణుగుంట సబ్ డివిజన్ పరిధిలోకి ముసలిపెడు గ్రామంలో పేకాట శిబిరం పై దాడి చేసి నగదుతో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదే నెలలో పాడుబడ్డ ఇళ్ళ వద్ద గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రజలు సమాచారం ఇచ్చేందుకు ఓ హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసారు. తాజాగా చంద్రగిరి సబ్ డివిజన్ లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాతో బీట్ నిర్వహించి.. అటవీ ప్రాంతంలో నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా డ్రోన్ వాడుతున్నారు పోలీసులు. రోడ్లపై దూకుడుగా డ్రైవింగ్ చేసే వారిని, ట్రిపుల్ రైడింగ్ వంటివి చేసే వారిని డ్రోన్ సహాయంతో గుర్తిస్తున్నారు.
తాజాగా పేకాట అడుతున్న 17మందిని డ్రోన్ తో గుర్తించి అరెస్ట్ చేసి.. భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. మరిన్ని డ్రోన్ లను జిల్లా పోలీసులకు అందిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా వీటిని వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. యెర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం డ్రోన్ సేవలను వినియోగించే అవకాశం ఉందని జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి.