TDP: పదవులు దక్కుతాయని పసుపు తీర్థం పుచ్చుకున్న నేతల భవిష్యతు ప్రశ్నార్ధకం..

రాజకీయాల్లో ఒక పార్టీని వదిలి మరో పార్టీ చేరడం కొత్త విషయం కాదు. అవకాశం ఉన్నచోటికి వెళ్లాలని అనుకునే నేతలు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి మార్పులు చేసిన వారికి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. స్థానిక రాజకీయ పరిణామాలు, అక్కడి నేతల ప్రభావం, ఇప్పటికే ఉన్న సీనియర్లు వీరి ఎదుగుదలకు అడ్డుకట్టవేస్తున్నాయి. దీంతో కొత్తగా చేరిన నేతలు ఆశించిన గుర్తింపు దొరకక ఇబ్బంది పడుతున్నారు.
గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల తరువాత వైసీపీ (YCP) నుండి పలువురు ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరారు. వీరిలో కొందరు తమ పదవులను కూడా వదులుకున్నారు. ప్రభుత్వ ఒత్తిడి తప్పించుకోవడమో, భవిష్యత్‌లో అవకాశాలు దక్కుతాయనే నమ్మకంతోనో ఈ మార్పులు జరిగాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వారిని ముందుకు తీసుకెళ్లడంలో టిడిపి నాయకత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఉదాహరణగా బీద మస్తాన్ రావు (Beeda Mastan Rao), మోపిదేవి వెంకట రమణ (Mopidevi Venkata Ramana) లాంటి వారు రాజ్యసభ సభ్యత్వాన్ని విడిచిపెట్టి టీడీపీలో చేరారు. దాదాపు ఎనిమిది నెలలు గడిచినా వారికి పెద్దగా ప్రాధాన్యం రాలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఉన్న టిడిపి సీనియర్ నేతల స్థానం తగ్గిపోతుందనే ఆందోళన కారణంగా వారికి ముఖ్య స్థానాలు ఇవ్వకుండా పక్కన పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అలాగే ఎమ్మెల్సీ పదవులను కూడా వదులుకుని టీడీపీ లోకి వచ్చే ప్రయత్నాలు చేసిన వారు ఉన్నారు. వీరిలో బల్లి కల్యాణ్ చక్రవర్తి (Balli Kalyan Chakravarthy), పోతుల సునీత (Pothula Sunitha), జయమంగళ వెంకట రమణ (Jayamangala Venkata Ramana) పేర్లు ప్రస్తావనకు వస్తాయి. ఈ ముగ్గురిలో జయమంగళ వెంకట రమణ మాత్రమే టీడీపీ లో నేరుగా చేరారు. మిగిలిన వారు తమ రాజీనామాల ఆమోదం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. కానీ వీరికి టీడీపీ నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుందా అన్నది సందేహంగా మారింది.
ముఖ్యంగా పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి లాంటి నేతలకు స్థానికంగా ప్రతిస్పర్థులు ఉండటం, వారిని సులభంగా ఒప్పించడం కష్టంగా మారింది. దీంతో వీరికి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రోత్సాహం ఇవ్వాలనుకున్నా, క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ నేతలు గట్టి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకప్పుడు వైఎస్సార్సీపీ నుండి బయటికి వచ్చి తెలుగుదేశంలో అవకాశాలు పొందాలని కలలు కన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారికి ఇచ్చే ప్రాముఖ్యత తగ్గిపోవడంతో రాజకీయ భవిష్యత్తు పై అనిశ్చితి నెలకొంది. “జంప్” చేసిన నేతలకు అవకాశాలు లేకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని చెప్పవచ్చు.