Pulivendula: 30 ఏళ్లుగా ఏకగ్రీవం.. తొలిసారి బరిలోకి టీడీపీ.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు చాలా స్పెషల్ గురూ..!
కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఫైట్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ (YCP) తరపున మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి, టీడీపీ తరపున బిటెక్ రవి భార్య లతా రెడ్డి బరిలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇద్దరూ సీమ అభ్యర్థులే కావడం..పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో అక్కడక్కడా హింసాత్మక ఘటనలు తప్పడం లేదు. అయితే ఇందులో అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే.. 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్ల గాను 2,500 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విత్ డ్రా సమయం అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రం అయ్యాయి… అయితే అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో 2750 ఓట్లు సాధించింది టీడీపీ.. 1995, 2001, 2006 సంవత్సరాలలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..
ఇక, 2021లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.. 2021లో పులివెందుల జడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది… ఈ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. సొంత గడ్డపై తిరిగి జెండా ఎగురవేయాలని వైసీపీ భావిస్తుంటే, ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా పాతాలని తెలుగదేశం భావిస్తోంది.
టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ రవి సతీమణి అభ్యర్థిగా ఉండడంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది… వైసీపీ సిట్టింగ్ జడ్పిటిసి స్థానాన్ని వదులుకునే ప్రసక్తి లేదని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. నల్లగొండ వారి పల్లె లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ నేతలు దాడులు చేసి గాయపరిచారు.. ఈ దాడులపై అటు వైసీపీ, ఇటు టిడిపి వారి పై కేసులు కూడా నమోదు అయ్యాయి.







