TDP vs YCP: టీడీపీ vs వైసీపీ..సామాన్యుని గడప వద్దే రాజకీయ సమరశంఖం..

ఏపీలో జూలై 1వ తేదీ నుంచి రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల దైనందిన జీవితాల్లోకి రాజకీయాలు మరింతగా దూరే పరిస్థితి ఏర్పడుతోంది. అధికార కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) ఒకవైపు, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party – YSRCP) మరోవైపు రెండు వేర్వేరు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా ప్రజల తలుపు దగ్గరే రాజకీయ చర్చలు మొదలయ్యేలా ఉంది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తైన నేపథ్యంలో ‘సుపరిపాలన’ పేరుతో ఇంటింటికి నేతలను పంపాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, వార్డు స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలి. ప్రతి ఇంట్లోని సమస్యలు కూడా గుర్తించాలన్న దిశగా ఈ ప్రయత్నం సాగనుంది. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) కూడా ఓ వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ‘రీకాల్ చంద్రబాబు’స్ (Recall Chandrababu’s manifesto) మేనిఫెస్టో’ అనే పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఐదు వారాల పాటు నేతలు ప్రజల్లోకి వెళ్లి గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తారు. అవి అమలయ్యాయా లేదా అనే విషయాన్ని వివరంగా చెప్పనున్నారు. ప్రజలకు అందాల్సిన నిధులు ఎంత? ఇప్పటివరకు అందింది ఎంత? మిగిలిన నిధుల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు కూడా ఇందులో భాగం కానున్నాయి.
ఇలా రెండు ప్రధాన పార్టీలు ఇంటింటికీ చేరుతుండటం వల్ల ప్రజలు రాజకీయ నాయకులను నేరుగా కలవడానికి అవకాశమొస్తుంది. కానీ ప్రజల సమస్యల లోని వాస్తవాన్ని వీరు కచ్చితంగా గ్రహిస్తారా? లేక ఈ మొత్తం ఓ రాజకీయ షోగా ముగుస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కోరుకునే పరిష్కారాలు తక్షణమే సాధ్యపడతాయన్న భ్రమ వారికి లేదు. అయితే ప్రస్తుతం రెండు పార్టీలు తగ్గేదే లేదు అన్నట్టు ప్రజలలో తమ ప్రభావం ఎంతవరకు ఉందో నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. దీంతో జులై ఒకటి నుంచి ఏపీలో ఈ రాజకీయ వేడి ఏ స్థాయికి పోతుందో చూడాలి.