ఏపీని కేంద్రమే ఆదుకోవాలి : ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు

ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేయూత ఇచ్చి ఆదుకోవాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు కోరారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని, ఈ ప్రతులను లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ అందజేస్తామని తెలిపారు. ఆయన లోక్‌సభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోందని, ఆ కష్టాల నుంచి కేంద్రమే గట్టెక్కించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, చేనేత కార్మికులను మరింతగా ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆక్వా ఎగుమతులు 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయన్నారు. పీఎం మత్స్య సంపద యోజన కింద ఆక్వా రైతులను ప్రోత్సహించాలని కోరారు.