TDP: అందరూ ఇది గుర్తుంచుకోవాలి: లోకేశ్
పార్టీ లేకపోతే మనమెవరమూ లేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. మనకు గుర్తింపు గౌరవం దక్కుతున్నాయంటే దానికి కారణం పార్టీయే. ఇదెవరూ విస్మరించకూడదు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ (Lokesh) అన్నారు. టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన పార్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనేది టీడీపీ సిద్ధాంతమని, పార్టీ విధానం కూడా అదేనని స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీ అనేది యూనివర్సిటీలాంటిదన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) 2012లో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారని, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంత్రి (Minister) స్థాయిలో ఉన్నారని తెలిపారు. గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉపముఖ్యమంత్రులుగా పనిచేయాలనేది పార్టీ సిద్ధాంతం, విధానమని చెప్పారు. తొలిరోజు శిక్షణ తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.






