Social Media: సోషల్ మీడియాపై నిఘా.. ఆధార్‌తో అనుసంధానం?

సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) సిద్ధమవుతోంది. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తోంది. బుధవారం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ విషయం వెల్లడించారు. ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోస్టులు పెట్టాలని సూచించారు. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting) అనంతరం కూడా ఈ అంశంపై సీఎం చంద్రబాబు కేబినెట్ సహచరులకు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా మంత్రులతో సీఎం చర్చించారు. ఎరువులకు ఇబ్బంది లేకున్నా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. సరైన సమయంలో వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచి ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చించారు.
వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుటి నుంచి ఫేక్ ప్రచారం ఎక్కువయిందనే చర్చ ఉంది. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్లు విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారు. వీటిలో ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టే వాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎంతోకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్లు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. అందుకే ఇలాంటి వాటిని ఆదిలోనే తిప్పికొట్టాలనే నిర్ణయానికి వచ్చారు.
సోషల్ మీడియా పోస్టులను ఇకపై పూర్తిగా రివ్యూ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తున్నా, వ్యక్తిగత విమర్శలకు దిగినా, అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు కట్టబెడుతూ చట్టం తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏవైనా పోస్టులు పెడితే వాటికి ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆధారాలు సమర్పించకపోతో ఆయా పోస్టులను బట్టి వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ (Aadhar) లాంటి వాటితో అనుసంధానం చేయడం ద్వారా ఫేక్ అకౌంట్లకు చెక్ పెట్టవచ్చని ఏపీ ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే విప్లవాత్మక మార్పు ఖాయం. కానీ అది ఎంతవరకూ సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.