ఏపీలో సన్ ఫార్మా యూనిట్
ఫార్మాస్యూటికల్స్ రంగం లోని పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిట్రేగెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ సంఫ్వీు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో సంఫ్వీు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అనంతరం దిలీప్ సంఫ్వీు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ముఖ్యమంత్రి విధానంగా స్పష్టమవుతోంది. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారు. మా కంపెనీ తరపున మేం కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామని తెలిపారు. సన్ ఫార్మా తరపున ఒక పరిశ్రమను నెలకొల్పుతామని, తద్వారా మా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు విజయ్ పరేఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు.






