Local Politics: పార్టీ భవిష్యత్తుపై గ్రహణంగా మారుతున్న వారసత్వ రాజకీయాలు..

భారతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి చూస్తే కుటుంబ ప్రభావం ఎంతగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ తరచుగా ఇవి కుటుంబ ఆధారిత పార్టీలు అని విమర్శలు చేస్తుంది. ఆ ఆరోపణలకు కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి పార్టీల్లో నాయకత్వం ఎక్కువగా వారసత్వ పద్ధతిలోనే కొనసాగుతుంది. తండ్రి తరువాత కుమారుడు లేదా కుమార్తె ముందుకు వస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల, పార్టీలో సంవత్సరాల తరబడి శ్రమించిన నాయకులకు పెద్దగా ప్రాధాన్యత దక్కదు. చివరికి వారు అన్యాయం ఎదుర్కోవాల్సి వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే దీనికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 1995లో తెలుగుదేశం పార్టీ (TDP)లో ఏర్పడిన సంక్షోభం అంతా ఎన్టీఆర్ (NTR) కుటుంబంలోనే జరిగింది. ఆ సమయంలో నందమూరి కుటుంబ అంతర్గత కలహాలే పెద్ద సమస్యగా మారాయి. అయితే చివరికి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీని తన ఆధీనంలోకి తీసుకుని మూడు దశాబ్దాలు విజయవంతంగా నడిపించారు. ఆయన తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) విషయానికి వస్తే, 2019లో అధికారంలోకి వచ్చాక అక్కడ కూడా కుటుంబ విభేదాలు మునుపటి కంటే స్పష్టంగా బయటపడ్డాయి. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చెల్లెలు వైఎస్ షర్మిల (Sharmila) పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ వేసి ఆ తరువాత కాంగ్రెస్ (Congress)లో విలీనం చేశారు. చివరికి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమికి షర్మిల పాత్ర కూడా ప్రభావం చూపిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆమె సొంత పార్టీని గెలిపించడం కంటే కూడా అన్న పార్టీకి ఓట్లు పడకూడదు అనే ఉద్దేశంతోనే తన ప్రచారాన్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే.
అలాగే తెలంగాణాలోని బీఆర్ఎస్ (BRS) కూడా ఇటీవలి ఓటమి తరువాత అంతర్గత సమస్యలతో బలహీనపడుతోంది. కేసీఆర్ (KCR) అధికారంలో ఉన్న సమయంలో పెద్దగా విభేదాలు లేకపోయినా, ఓటమి తరువాత కవిత (Kavitha) చర్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. ప్రత్యర్థులకు ఆయుధాల్లా అవి ఉపయోగపడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ సొంత కుటుంబం నుంచే ఎదురుదెబ్బలు తింటోంది.
ఇలాంటి పరిణామాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో (Tamil Nadu) డీఎంకే (DMK)లోనూ ఒక దశలో వారసత్వ పోరు ముదిరింది. కానీ స్టాలిన్ (Stalin) చాకచక్యంగా పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అలాగే బీహార్ (Bihar)లో లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) చిన్న కుమారుడు తేజస్వి (Tejashwi) వారసుడిగా ఎదిగాడు. పెద్ద కుమారుడు వ్యక్తిగత వివాదాల వల్ల పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర (Maharashtra)లో శివసేన (Shiv Sena) కూడా కుటుంబ కలహాలతో విడిపోయి, మళ్లీ కలవాలని ప్రయత్నిస్తోంది.
మొత్తానికి పార్టీలు ప్రజల్లో బలపడినప్పుడు, వాటి భవిష్యత్తు కుటుంబ సమస్యలపై ఆధారపడి ఉండకూడదు. ఎందుకంటే ఆ పోరాటాల్లో వేలాది కార్యకర్తల శ్రమ, ఆశలు కూడా కరిగిపోతాయి. కాబట్టి కుటుంబాల ఆధీనంలో నడిచే పార్టీలకు ముందున్న పెద్ద సవాలు తమ అంతర్గత విభేదాలను జాగ్రత్తగా అధిగమించడమే. అలా జరగని పక్షంలో సంవత్సరాలు కష్టపడి నిర్మించిన పార్టీ కళ్ళముందే కూలిపోవడం ఖాయం.