Mithun Reddy: మిథున్ రెడ్డి అరెస్టు కోసం రంగంలోకి దిగిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం (AP Liquor Scam Case) కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి (YCP MP Mithun Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించడమే కాక, సరెండర్ కోసం అదనపు సమయం ఇచ్చేందుకు కూడా ససేమిరా అనింది. దీంతో మిథున్ రెడ్డి అరెస్టు దాదాపు అనివార్యమైంది. ఈ తీర్పుతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సిట్ వెంటనే రంగంలోకి దిగింది. అరెస్టు వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టులో జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మిథున్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. మిథున్ రెడ్డి తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని, తన క్లయింట్‌పై ఆధారాలు లేని నీరసమైన ఆరోపణలు చేస్తున్నారని సింఘ్వీ వాదించారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నందున, ఆయన గౌరవాన్ని, హోదాను దృష్టిలో ఉంచుకోవాలని కోర్టును కోరారు. అరెస్టు చేసే ముందు సమగ్ర ఆధారాలను పరిశీలించాలని, యాంత్రిక అరెస్టులను నివారించాలని ఆయన వాదనలో పేర్కొన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, మిథున్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇతర నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. మద్యం సరఫరా వ్యవస్థలో పోటీని అణచివేసి, నిర్దిష్ట సంస్థలకు లబ్ధి చేకూర్చేలా మిథున్ రెడ్డి కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఉన్నాయని రోహత్గీ వాదించారు. కస్టడీలోకి తీసుకోవడం దర్యాప్తుకు అవసరమని, ఆయన ప్రభావం దర్యాప్తును ప్రభావితం చేయవచ్చని కోర్టుకు వివరించారు.
ఈ కేసులో మిథున్ రెడ్డిని మొదట్లో నిందితుడిగా చేర్చలేదు. అందుకే ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, తరువాత మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చడంతో, మే 13న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను రద్దు చేసి, నాలుగు వారాల్లో కొత్తగా విచారణ జరపాలని, అప్పటి వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. జులై 15న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మళ్లీ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా కస్టడీ విచారణ అవసరమని పేర్కొంది. దీని తర్వాత, SIT ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసింది.
తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదనంగా, సరెండర్ కోసం సమయం ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది, దీంతో ఆయన అరెస్టు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సిట్ వెంటనే రంగంలోకి దిగింది. మిథున్ రెడ్డిపై అరెస్ట్ వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మిధున్ రెడ్డి అరెస్టు కోసం చట్టప్రకారం ముందుకెళ్తోంది.